ఓ కునికిపాటుకు.. రూ. కోట్లు నష్టం
కోల్కతా: డ్రైవర్ నిద్రమత్తులో చేసిన తప్పిదం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాన్ని నిద్రమత్తులో ఢీకొట్టినట్టు జెట్ ఎయిర్ వేస్ బస్ డ్రైవర్ మొమిన్ అలీ విచారణలో చెప్పాడు. మొమిన్ను ప్రశ్నించి, వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఎయిర్పోర్టు డైరెక్టర్ ఏకే శర్మ తెలిపారు. మొమిన్ సోమవారం నైట్ డ్యూటీలో ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.
జెట్ ఎయిర్వేస్ బస్సు ఢీకొన్న విమానం విలువ 400 కోట్ల రూపాయలని, విమానం చాలా వరకు దెబ్బతిన్నట్టు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో కానీ, బస్సులో కానీ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసోం వెళ్లాల్సిన ఈ విమానాన్ని కోల్కతా ఎయిర్పోర్టులో పార్క్ చేశారు. ఈ ప్రమాదం అనంతరం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సిన రెండు విమానాలను రద్దు చేసినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ప్రమాద ఘటనపై పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.