కరెంట్ అవసరం లేని బుల్లి ఏసీ!
డీప్ ఫ్రీజర్‌ను మరింత సమర్థంగా వాడుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఫొటోలో కనిపిస్తున్న బుల్లి ఏసీ మీకోసమే. గైజర్ అని పిలుస్తున్న దీనికి కరెంటే అవసరం లేదు.. ఎక్కువ స్థలం కూడా పట్టదు. మండే ఎండల్లో ఇంట్లో చల్లటి గాలి అందిస్తుంది. మంచుముక్కలతో కూడిన ఓ బుల్లిపెట్టెను ఈ గాడ్జెట్‌లో పెట్టేస్తే సరి. ఈ పరికరం అడుగుభాగంలో ఉండే బ్యాటరీ ద్వారా పై భాగంలో ఉండే ఫ్యాన్ తిరుగుతుంది. ఈ మంచు ముక్కలు కరగడం ద్వారా చల్లటి గాలి బయటకు వస్తుంది.
ఈ గైజర్‌లో ఉండే ఓ ప్రత్యేకమైన రసాయనం.. మంచు చాలా నెమ్మదిగా కరిగేలా చేస్తుంది. అందులోనూ కలపతో తయారైన ఈ గైజర్ వేడి లేదా చల్లదనం ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. దీనిపైన ఉండే ప్రత్యేకమైన కిటికీ ద్వారా దాదాపు 12 చదరపు మీటర్ల వైశాల్యమున్న గదులను కూడా తొందరగా చల్లబరుస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం కిక్‌స్టార్టర్‌లో నిధుల సమీకరణ జరుగుతోంది.