ఎయిర్ ఇండియా సిబ్బందికి 'ఆకట్టుకునే' సూచనలు!
న్యూఢిల్లీః ఎయిర్ ఇండియాపై ఇటీవల అనేక విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సంస్థపై పడ్డ చెడు ముద్రను చెరిపే పనిలో నిమగ్నమయ్యారు. ముఖంపై నవ్వును చిందిస్తూ ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా ఎలా వ్యవహరించాలో ఎయిర్ లైన్స్ ఛీఫ్.. అశ్వనీ లొహానీ సిబ్బందికి వివరించారు. చిరునవ్వుతో కూడిన పలకరింపు ఓ మంచి లక్షణమని, అది సిబ్బంది అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరమని కొత్త సూచనలు చేశారు.
విమానాల ఆలస్యం విషయంలో కాక్ పిట్, కేబిన్ క్రూ సిబ్బంది సంయమనం పాటిస్తూ... ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలని అశ్వనీ లొహానీ సిబ్బందికి సలహా ఇచ్చారు. చెక్ ఇన్ ఏజెంట్లు తప్పనిసరిగా ప్రయాణీకులకు అందుబాటులో ఉండాలని, వారి అనుమానాలను నివృత్తి చేస్తూ వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా సిబ్బంది, సంస్థకు సంబంధించిన ఏజెన్సీల ప్రవర్తన అనుకూలంగా ఉండి, సమస్యను పరిష్కరించేట్టుగా ఉండాలని సూచించారు. ఎయిర్ ఇండియాలో ప్రయాణం ప్రయాణీకులకు 'మంచి' అనుభవం కావాలని, అందుకు సిబ్బంది సహకారం అవసరమని కోరారు.
ముఖ్యంగా విమానాల ఆలస్యం విషయంలో సిబ్బందికి, ప్రయాణీకులకు మధ్య వివాదాలు తలెత్తడం ఇటీవలి కాలంలో తరచుగా ఎదురౌతున్న నేపథ్యంలో లొహానీ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. కేబిన్ సిబ్బంది.. ప్రయాణీకులకు సంప్రదాయ బద్ధంగా నమస్కరించాలని, ప్రయాణీకులనుంచి అభినందనలు పొందే విధంగా ఉండాలని, ముఖంపై నవ్వుతో మర్యాద పూర్వక సంభాషణలను చేయాలని లొహానీ చెప్పారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి, లేదా ఆలస్యం ఉన్నపుడు వెంటనే విమానాశ్రయ మనేజర్, స్టేషన్ మేనేజర్ ప్రయాణీకుల ముందు హాజరవ్వాలన్నారు. అంతేకాక వారితో మర్యాదపూర్వకంగా సంభాషించి, సమస్యను సులభంగా అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రయాణీకులకు అందించే ఆహారం నాణ్యత విషయంలోనూ శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఛెఫ్ తనిఖీలు నిర్వహిస్తుండాలని తెలిపారు.