
‘బన్సూరీ(సుష్మా స్వరాజ్ కుమార్తె)ని నన్ను సెలబ్రిటీ లంచ్ కోసం రెస్టారెంటుకు తీసుకువెళ్తా అని చెప్పారు. కానీ మా ఇద్దరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయారు దీదీ’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. సుష్మా స్వరాజ్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఉద్వేగానికి లోనయ్యారు. ‘సుష్మాజీ ఆకస్మిక మరణం వేలాది మంది కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పార్టీ కార్యకర్తగా మహిళా సాధికారతకై మన జీవితాన్ని అంకితం చేసినట్లయితే...అదే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి’ అంటూ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి స్మృతి మరో ట్వీట్ చేశారు.
కాగా విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన సుష్మా స్వరాజ్.. అనతికాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యర్థి పార్టీలపై పదునైన మాటల తూటాలతో విరుచుకుపడుతూనే... తనదైన శైలిలో ప్రసంగాలు చేసి వారిని సైతం ఆకట్టుకునేవారు. కేవలం రాజకీయ నాయకురాలిగానే గాకుండా... మంచి మనసున్న ‘అమ్మ’గా ప్రజలకు దగ్గరయ్యారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన సుష్మా స్వరాజ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణంతో యావత్ దేశం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా నివాసానికి చేరుకుని ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె భౌతికకాయం చూడగానే బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు. అద్వానీ, మోదీ సుష్మను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు.
असंख्य महिला कार्यकर्ताओं की प्रेरणा दीदी का आकस्मिक निधन हम सबको स्तब्ध कर गया । आज उनके शोकाकुल परिवार के प्रति सहानुभूति व्यक्त करती हूँ ।एक कार्यकर्ता के नाते महिला उत्थान के प्रति अगर हम अपना जीवन समर्पित करे तो वो दीदी के प्रति सच्ची श्रधांजलि होगी । pic.twitter.com/J7aJTCQtpm
— Smriti Z Irani (@smritiirani) August 7, 2019