సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రభుత్వ శాఖలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖలు సోషల్ మీడియాను సమాచార సాధనంగా బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఖాతాలు తెరిచి, సమాచారం అందజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ శాఖల్లో విదేశాంగ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ట్వీటర్‌లో విదేశాంగ శాఖ ఖాతా 'ఇండియన్ డిప్లొమసీ'ని ఇతర అన్ని మంత్రిత్వ శాఖల కంటే అత్యధికంగా మొత్తం 2.76 లక్షల మంది ఫాలో అవుతున్నారు. విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి నిర్వహిస్తున్న 'ఎంఈఏఇండియా' అకౌంట్‌నూ 1.98 లక్షల మంది, వీసా, పాస్‌పోర్టు అంశాలకు సంబంధించిన 'సీపీవీఇండియా' అకౌంట్‌ను 3,500 మంది అనుసరిస్తున్నారు.
అదేవిధంగా ఫేస్‌బుక్‌లో 6.82 లక్షల లైకులతో ఇతర మంత్రిత్వ శాఖల కన్నా విదేశాంగ శాఖ టాప్‌లో నిలిచింది. యూట్యూబ్‌లో 'ఇండియన్ డిప్లొమసీ' పేరుతో నిర్వహిస్తున్న అధికారిక చానెల్‌ను 43 లక్షల మంది సందర్శించగా, 16,500 మంది చందాదారులుగా చేరారు. 'ద ఎంఈఏ ఇండియా యూట్యూబ్' చానెల్‌ను 5.5 లక్షల మంది సందర్శించగా, 6,100 మంది చందాదారులుగా చేరారు.
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం సోషల్ మీడియాలో అన్ని ప్రభుత్వ విభాగాల కంటే ఎంతో ముందంజలో దూసుకుపోతోంది. డిసెంబరు 22 నాటికి మోదీకి ఫేస్‌బుక్‌లో 2.62 కోట్ల లైకులు వచ్చాయి. ట్వీటర్‌లో ఆయనను 89.3 లక్షల మంది అనుసరిస్తున్నారు. ట్వీటర్‌లో 'పీఎంవోఇండియా'ని 41 లక్షల మంది ఫాలో అవుతున్నారు.