2015లో ఇంటర్నెట్ లో కొన్ని ఫోటోలు నెట్జనులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రధానితో సహా పలువురు రాజకీయ ప్రముఖులు నెటీజియన్ల వినోదంలో భాగమయ్యారు. ఆ సంగతులను ఓ సారి గుర్తు చేసుకుంటే...
చెన్నై వరదల సందర్భంగా ప్రధానమంత్రి నరేద్రమోదీ చేపట్టిన ఏరియల్ సర్వే ఫోటో రేపిన దుమారం అంతాఇంతా కాదు. హెలికాప్టర్ నుండి స్పష్టంగా కనిపించని దృశ్యాన్ని కన్పిస్తున్నట్లు రిలీజ్ చేయడంతో నెట్జనులు దీనికి తీవ్రంగా స్పందించారు. ప్రధాని వాషింగ్ మెషిన్ను ఆసక్తిగా చూస్తున్నట్లు చేసిన మార్ఫింగ్ ఫోటో నెట్లో హల్చల్ చేసింది.
ఫిబ్రవరిలో రాష్ట్రపతి భవన్ను ప్రజల సందర్శనకు అనుమతించిన సందర్భంగా నల్లని సూట్లో ప్రత్యక్షమైన ప్రణబ్ విచిత్రమైన పోజ్లు ఇచ్చారు. దీంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అనేక కామెంట్లతో రాష్ట్రపతి ఫోటోలను రకరకాలుగా వాడుకున్నారు. అందులో అతీంద్రియ శక్తులున్నట్లు ప్రణబ్ను చూపించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 'మఫ్లర్ మ్యాన్' గా పేర్కొంటు ఆయన మద్దతుదారులు చేసిన ఫోటోలు బాగా ఆదరణ పొందాయి. కేజ్రీవాల్ రెండవసారి సీఎం పగ్గాలు చేపట్టిన సందర్భంలో మఫ్లర్ మ్యాన్ రిటర్న్స్ చిత్రాలు సైతం నెట్ జనులను ఆకట్టుకున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు క్లీన్చిట్ ఇచ్చిన సందర్భంగా మమ్మీ రిటర్న్స్ చిత్రాలు చేసిన హడావిడి నెట్ జనులు మరచిపోలేరు. మదర్స్ డే అనంతరం కోర్టు తీర్పు వెలువడిన రోజును సోషల్ మీడియాలో 'అమ్మా డే' గా పేర్కొనడం విశేషం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వేసిన యోగాసనాలు మర్చిపోలేనివి. ట్విట్టర్లో ఆయన యోగా చేస్తున్నట్లున్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్గా మారాయి. మంత్రిగారి యోగాపై పడ్డ సెటైర్లు నెట్ ప్రియులకు మంచి హాస్యాన్ని పంచాయి.