అది ఆటవిక క్రూర చర్య.. ఏ మతం అలా చెప్పదు
న్యూఢిల్లీ: కెన్యాలో విశ్వవిద్యాలయ విద్యార్థులపై ఉగ్రవాదులు చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారు. అది మనుషులెవరూ చేయాల్సిన పని కాదని అన్నారు. అది ముమ్మాటికి క్రూరమైన ఆటవిక చర్య అని ఆమె అభివర్ణించారు. ఏ సిద్ధాంతమైనా, ఏ మతమైన ఇలాంటి హింసాత్మక దారుణాలకు పాల్పడండని చెప్పబోదని సోనియా గుర్తు చేశారు. ఉగ్రవాదుల కారణంగా అంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని అన్నారు. ఏమాత్రం మానవత్వం లేకుండా ఉగ్రవాదులు ప్రవర్తించారని, ఈ చర్యను గర్హించలేమని సోనియా వ్యాఖ్యానించారు.
సోమాలియా సరిహద్దులో ఉండే అల్ కాయిదాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్కు చెందిన తీవ్రవాదులు కెన్యాలోని విశ్వవిద్యాలయంలోకి చొరబడి కనిపించిన విద్యార్థులందరిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మొత్తం 147 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యల గాయాలపాలయ్యారు. వారు దాడి చేసే సమయంలో విద్యార్థులంతా నిద్ర మత్తులో ఉండగా హఠాత్తుగా దాడి జరిగింది.