
సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి
ఎన్డీఏ తీరు అలా అనిపిస్తోంది: సోనియా
♦ అన్యాయం ముందు తలవంచం
♦ ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీలో వ్యాఖ్య
♦ జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ, అరెస్టు
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రతిపక్షంపై నిరాధార ఆరోపణలతో దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆందోళన నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమీపంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. జంతర్ మంతర్ వద్ద సోనియా మాట్లాడుతూ.. తమను భయపెట్టేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించవద్దని, జీవితం పోరాడడం నేర్పిందంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను బలహీన శక్తిగా భావించి తప్పు చేయవద్దని, అన్యాయం ముందు తమ పార్టీ ఎప్పుడూ తలవంచదన్నారు. దేశంలో పరిస్థితులు దిగజారితే ఎలా గుణపాఠం చెప్పాలో ప్రజలకు తెలుసని.. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం బాగా అర్థం చేసుకోవాలని అన్నారు.
ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చి మోసగిస్తున్నారని, చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అనిపిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ వెలుపల లోపల అప్రమత్తంగా ఉంటూ పూర్తి శక్తితో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. డబ్బు, అధికార బలంతో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాల్ని పడగొట్టడమంటే ప్రజాస్వామ్య పునాదుల్ని కూల్చడమే కాక హత్య చేయడం కూడా అని విమర్శించారు. దేశంలోని ప్రతి మూలకు వెళ్లి మోదీ ప్రభుత్వం నిజస్వరూపాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్య విధానాల్ని నాశనం చేసేందుకు అధికార పార్టీని అనుమతించబోమన్నారు.
మతం, ప్రాంతం, భాష, ఆహారపు అలవాట్ల ఆధారంగా ప్రజల్ని విడదీస్తున్నారని మైనార్టీలు భయం నీడలో బతుకుతున్నారని చెప్పారు. నాగ్‌పూర్ ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ను సోనియా పరోక్షంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం కోసం ఎలాంటి త్యాగాలకైనా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదన్నారు. బీజేపీ వాదనల్ని అంగీకరించని వారిపై దేశ ద్రోహులుగా ముద్రవేస్తున్నారని, వాటిపై ఎలా పోరాడాలో కాంగ్రెస్‌కు తెలుసన్నారు. రెండేళ్ల పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సోనియా విమర్శించారు. తప్పుడు వాగ్దానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మరింతగా అధికార దాహం పెరిగిందని తప్పుపట్టారు. ధరల అదుపులో కేంద్ర ం విఫలమైందని, దీనివల్ల మహిళలు, పేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కరువుపై ప్రధాని స్పందించరే?: రాహుల్
ఇద్దరు వ్యక్తుల ఆదేశాలు మాత్రమే దేశంలో చెలామణీ అవుతున్నాయని, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ మోదీ, మోహన్ భాగవత్‌లను ర్యాలీలో రాహుల్ పరోక్షంగా విమర్శించారు. దేశంలో 40 శాతం కరువును ఎదుర్కొంటోందని, రోజూ 50 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... దానిపై ప్రధాని ఏమీ మాట్లాడరంటూ తప్పుపట్టారు. ‘అచ్ఛే దిన్’ వస్తుందని వాగ్దానం చేశారని, దేశం మాత్రం కరవు కోరల్లో చిక్కుకుందన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారని, గతేడాది కేవలం 1.3 లక్షల మందికే ఉద్యోగాలు దక్కాయన్నారు.
4 రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చే కుట్ర: మన్మోహ న్
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ప్రచారాన్ని తప్పుపట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్... కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఆత్మ అని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలపై భయంకరమైన దాడుల్ని ఎదుర్కొనేందుకు సోనియా, రాహుల్‌తో కలిసి పనిచేయాలన్నారు. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌ల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల్ని కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని, ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా తన దారి నుంచి వైదొలగదని చెప్పారు.