
ఆస్పత్రి నుంచే సోనియా రాజకీయం
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆస్పత్రి పాలైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. అక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. సోమవారం నాడు ఢిల్లీ వస్తే.. ఒక సమావేశం నిర్వహించుకుందామని చెప్పారు. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఎలాగైనా నిలబెట్టాలన్నది ఆమె వ్యూహం. అధికారపక్షం ఈ ఎన్నికల్లో నెగ్గడానికి చాలావరకు అవకాశాలున్నాయి. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయితే, తాము పూర్తిగా వదిలేస్తే అధికారపక్షం సులభంగా తీసుకుంటుందని, అలా కాకుండా గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాక.. ఇప్పుడు ప్రతిపక్షాలన్నింటినీ ఈ పేరుతో ఒక్కతాటి మీదకు తెస్తే, రెండేళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఐక్యతను కొనసాగించి బీజేపీని మట్టి కరిపించవచ్చన్నది సోనియా అసలైన వ్యూహంలా కనిపిస్తోంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరాఠా రాజకీయ భీష్ముడు శరద్ పవార్ తదితరులను సోనియా ఇప్పటికే కలిశారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను కలిశారు. సోమవారం నాటి సమావేశం తర్వాత మమతా బెనర్జీ కూడా వీళ్లకు మద్దతు ఇస్తారో లేదో తెలుస్తుంది. ఏప్రిల్ నెలలోనే అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగొచ్చిన సోనియా మళ్లీ ఆస్పత్రి పాలు కావడంతో పలు రకాల అనుమానాలు తలెత్తాయి. యూపీ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం చేయలేదు. దాంతో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలే ఎన్నికల వ్యూహాలు చూసుకున్నారు.
2012 సంవత్సరంలో నాటి బీజేపీ కూటమి మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పీఏ సంగ్మాను ఓడించి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యారు. ఆయన పదవీకాలం జూలై నెలలో ముగుస్తుంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ సరేనంటే తాను మరో విడత కూడా రాష్ట్రపతి పదవి చేపట్టడానికి సిద్ధమేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. యూపీతో పాటు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ ఫలితాలు రావడంతో తమ సొంత అభ్యర్థిని నిలబెట్టాలనే ఎన్డీయే భావిస్తోంది.