సాక్షి, ముంబై: మరాఠా, ముస్లిం వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు త్వరలోనే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రూపొందించిన ఫైలు ప్రస్తుతం గవర్నర్ కె.శంకర నారాయణన్ వద్ద ఉంది.ఆయన ఎప్పుడైనా సంతకం చేసే అవకాశాలున్నాయి. వెనువెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తారని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. రాష్ట్రంలో మరాఠాలకు 16 శాతం, ముస్లిమ్‌లకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఇటీవలే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.
దీనికి ఆమోదముద్ర కోసం గవర్నర్ వద్దకు పంపించారు. మరాఠాల ప్రజలను విద్య, సామాజిక వెనుకబాటుతనం తదితర అంశాలవారీగా విభజించి రిజర్వేషన్లు కల్పించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ సిఫార్సుల ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో సిఫార్సుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 32 శాతం రిజర్వేషన్లు పొందుతున్న కులాల్లో మరాఠాలు ఉన్నారు. వీరిని వేరు చేసిన ఇక నుంచి 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ రిజర్వేషన్లు ఉద్యోగ అవకాశాలకే వర్తిస్తాయని, ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు వర్తించకపోవచ్చని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్సు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ డేరియస్ కంబాటా న్యాయమూర్తి అభయ్ ఓకా నేతృత్వంలోని బెంచ్‌కు పైవిషయం తెలిపారు. ఈ కేసుపై తుదుపరి విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా పడింది.
రిజర్వేషన్ల ఫైలుకు త్వరలోనే మోక్షం
Published Wed, Jul 9 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement