
మెమన్ భార్యకు సీటిమ్మన్నాడని వేటు
ముంబై: మహారాష్ట్రలోసమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్కు ఫరూక్ లేఖ రాశారు. ఫరూక్ వ్యాఖ్యలకి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పార్టీ నుంచి వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
'దేశంలోని ముస్లింల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను పెద్దల సభలో వినిపించేందుకు ఓ గొంతు కావాలి.... ఈ నేపథ్యంలో రహీన్కు ఈ అవకాశం ఇస్తే... వారి కోసం ఆమె పోరాడుతుంది' అని ఘోసి లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మహారాష్ట్రలోని పలు పార్టీలు నిప్పులు చెరిగాయి.
మెమన్కు ఉరిశిక్షపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజకీయం చేయొవద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఎస్పీ నాయకులకు హితవు పలికారు. అయినా ఈ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. దానికి మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ బీజేపీ నాయకుడు మాదవ్ బండార్ సమాజ్ వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు.
అయితే ఈ విషయంపై ఎస్పీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అసిం అజ్మీ స్పందించారు. ఇది ఫరూక్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ అంశంపై ఆయన పార్టీని ఎప్పుడు సంప్రదించలేదన్నారు.