బాబాయ్-అబ్బాయ్ వర్గీయుల ఫైటింగ్
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో తన్నులాట కొనసాగుతోంది. బాబాయ్-అబ్బాయ్ వర్గీయుల మధ్య గొడవలు జరుగుతూనేవున్నాయి. తాజాగా ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ సమక్షంలోనే సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. 'వికాస్ రథయాత్ర' పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ గురువారం అఖిలేశ్ యాదవ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎస్పీ కార్యకర్తలు పరస్పరం తన్నుకున్నారు. జెండా కర్రలతో కొట్టుకున్నారు. పరస్పరం తోసుకుని, దూషణలకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మీడియా కెమెరాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.
అయితే సభలో పాల్గొన్న ములాయం, శివపాల్, అఖిలేశ్ ఏమీ జరగనట్టే వ్యవహరించారు. శివపాల్ యాదవ్ మాట్లాడుడూ... అఖిలేశ్ రథయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తున్న విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ పార్టీలో రేగిన పరి'వార్ ఇంకా చల్లారలేదనడానికి తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.