ప్రతీకాత్మక చిత్రం
రిజర్వేషన్ కావాలన్నా.. సరుకులు కొనాలన్నా.. బిల్లులు కట్టాలన్నా.. ఒకటేమిటి.. దేనికైనా.. గుమ్మం కదలనక్కర లేదు. చాంతాడంత క్యూల్లో నిల్చోనక్కర లేదు. ఆపసోపాలు పడనక్కర లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. చిటికెలో పనులు చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం ఫోన్లతోనే గడుపుతున్నారు. మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తూ.. సినిమాలు చూస్తూ.. రోజులో సగటున నాలుగైదు గంటలు ఫోన్లకే వెచ్చిస్తున్నారు. చేతిలో ఉన్నంతసేపూ చాటింగ్.. లేదా చార్జింగ్.. చార్జింగ్ చేస్తూ మళ్లీ చాటింగ్.. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. సెల్‌ఫోన్లు పేలిపోతూ ప్రాణాలు హరిస్తున్నాయి. ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు రావని నిపుణులు సూచిస్తున్నారు. – విజయనగరం మున్సిపాలిటీ
దాదాపు ప్రస్తుతం అందరూ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. వీటితో ఎంత ప్రయోజనం ఉందో.. వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే అంత ముప్పు కూడా పొంచి ఉంది. మొబైల్ పేలుతున్న సంఘటనల్లో ఎక్కువ శాతం చవగ్గా కొనుగోలు చేసినవి.. బ్రాండెడ్ కానివి మాత్రమే ఉంటున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయని కొంటున్న ఫోన్లు ఎంతవరకు భద్రమో తెలుసుకోవాలి. మొబైల్స్‌లో బ్యాటరీ అత్యంత కీలకం. నాసిరకానివి లోపాలతో పేలుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఫోన్లలో ఆయా సంస్థలు భద్రత పరంగా తీసుకునే చర్యలు పెద్దగా ఉండవు. ఎక్కువ సేపు మాట్లాడితే చాలు వేడెక్కి పేలిపోతుంటాయి.
చార్జింగ్‌లో అజాగ్రత్తలతో ముప్పు
చార్జింగ్ అవుతుండగా చాలామంది మాట్లాడుతుంటారు. వాట్సాప్, వీడియోలు చూస్తుంటారు. వీడియో గేమ్స్ ఆడుతుంటారు. ప్రమాదమని తెలిసినా తేలిగ్గా తీసుకోవడంతో చిక్కులు వస్తున్నాయి.
మొబైల్‌ను ఇతర విద్యుదుపకరణాలపై పెట్టడం సరికాదు. చార్జింగ్ పాయింటు ఉంది కదా అని రిఫ్రిజిరేటర్, టీవీపై కొందరు పెడుతుంటారు. అది ప్రమాదకరం.
ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన చార్జర్‌నే వాడాలి. ఇతర చార్జర్లతో ఫలితమున్నట్లు కనిపించినా అవుట్‌పుట్, ఇన్‌పుట్ ఓల్టేజీలో తేడాలుంటే ప్రమాదాలు సంభవిస్తాయి. చార్జర్ పోతే అదే సంస్థకు చెందినది తీసుకోవాలి. చౌకగా వస్తుందని నకిలీ చార్జర్లు వాడితే మన్నిక మూడు కాలాలే.
మెలకువగా ఉన్నంతసేపు ఫోన్లు రావడం, అంతర్జాలం చూడటంతో చార్జింగ్ కుదరడం లేదు. దీంతో రాత్రి నిద్రించే ముందు పెడుతున్నారు. ఆధునిక స్మార్ట్ ఫోన్లు అర్ధగంటలో చార్జింగ్ అవుతున్నాయి కాబట్టి.. ఉదయం లేచాక చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలో చార్జింగ్ పూర్తికాగానే ఆగిపోతుంది.
పేలిపోడానికి కారణాలివే
ఫోన్లు పేలడానికి ప్రధానంగా డిజైన్, బ్యాటరీ, తయారీలో లోపాలూ కారణమవుతాయి. చాలా సంస్థలు వీటిలో ఉపయోగించే పరికరాలను వేర్వేరు సంస్థలకు అప్పగిస్తుంటాయి. నిపుణులతో పాటు అంతగా నైపుణ్యం లేనివారూ ఉంటారు. చైనా మొబైల్స్‌తో కూడా అక్కడక్కడా సమస్యలు వస్తున్నాయి.
తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ అంటే బ్యాటరీ నాణ్యతలో రాజీ పడాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ సంస్థ ఫోన్ స్లిమ్‌గా ఉండాలని బ్యాటరీ లోపలే ఉండేలా డిజై¯Œన్ చేసింది. అప్పటివరకు తీసి పెట్టుకునేలా ఉండేది. బ్యాటరీ లోపలే ఉండటం, ఆ పక్కన స్థలం లేకుండా పోవడంతో పేలిన సంఘటనలున్నాయి.
మొబైల్స్ సైతం సంకోచ, వ్యాకోచాలకు గురవుతుంటాయి. లోపల తగినంత ఖాళీ స్థలం ఉంటే ఇబ్బంది ఉండదు. లేనివి వాతావరణ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. చాలా ఫోన్లు బ్యాటరీ ఉబ్బిపోయి.. కవర్ ఊడిపోయిన దాఖలాలున్నాయి.
చాలామంది బిగుతుగా ఉండే జీన్స్ ప్యాంట్‌లో ఫోన్లు పెట్టుకుంటారు. తగిన గాలి ఆడక కూడా పేలడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎర్తింగ్ సమస్యలు ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఓసారి అంతటా పరిశీలించుకోవాలి.
చార్జింగ్‌లో మాట్లాడొద్దు
ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్లపైనే మక్కువ పెంచుకుంటున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా గంటల తరబడి వాట్సాప్‌లు, ఫెస్‌బుక్‌ల్లో చాటింగ్‌లో, వీడియో కాల్స్ పేరిట మాట్లాడుతున్నారు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గుతుంటే ఆ సమయాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఓ వైపు బ్యాటరీ చార్జ్ అవుతుండగానే.. మరో వైపు వారి పని కానిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇటీవల ఓ సంస్థ సెల్‌ఫోన్‌లు చార్జింగ్ అవుతుండగా బ్యాటరీలు పేలిపోయినట్టు వార్తలు వచ్చాయి. అలాంటి సమస్య ఎవరికైనా ఎదురుకావచ్చు.
– ఎన్.లక్ష్మణరావు, సెల్‌ఫోన్ మెకానిక్, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment