
బీభత్సం సృష్టించిన బీఎండబ్ల్యూ
న్యూఢిల్లీ: ఢిల్లీలో నివాస సముదాయాల మధ్య మెర్సిడెజ్ బెంజ్ కారును అతివేగంగా నడుపుకుంటూ వెళ్లి ఓ వ్యక్తి మరణానికి దారితీసిన ఘటన మర్చిపోకముందే, మరో ఖరీదైన కారు ఢిల్లీకి సమీపంలో బీభత్సం సృష్టించింది. తాజాగా ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో మరో హిట్ అండ్ రన్ ఘటన నమోదైంది. దీంతో ఆరుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వేగంగా దూసుకు వచ్చిన బీఎండబ్ల్యూ కారు మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. దీంతో మూడు బైకుల మీద ఉన్న ఆరుగురు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడే తన కారును వదిలి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురిని ప్రేమ్ కుమార్, జోగిందర్, అన్వర్ , భూలే రామ్ గా గుర్తించారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండగా మరో ఇద్దరుస్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారు ఎవరిదన్న వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ ఆచూకీ కోసం విచారిస్తున్నారు.
కాగా ఈ నెలలోనే మెర్సిడెజ్ బెంజ్ కారుతో వీధుల్లోకి వచ్చిన ఓ మైనర్ బాలుడు తన కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన ఈ ప్రమాద దృశ్యాలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.