తీరానికి చేరిన అరుదైన భారీ తిమింగలం
భువనేశ్వర్: తమిళనాడులోని ట్యూటికోరిన్ సముద్ర తీరానికి వందల కొద్ది తిమింగలాలు చనిపోయి తీరానికి కొట్టుకువచ్చిన ఘటన మరువకముందే అదే రీతిలో ఓ భారీ తిమింగలం ఒడిషాలోని గంజం తీరానికి వచ్చింది. ఈ తీరం రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 33 అడుగులు ఉన్న ఈ భారీ తిమింగలం రక్తపుమడుగులో పడి ఉండటాన్ని తీరానికి వెళ్లిన స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ భారీ తిమింగలం రెండు, మూడు రోజుల కిందటే చనిపోయి ఉండొచ్చునని బెర్హంపూర్ డివిజన్ అటవీ అధికారి ఏకే బేహెరా అభిప్రాయపడ్డారు.
ఆ ప్రాంతంలో తిరిగే కొన్ని ప్రత్యేక నౌకలు, ఓడలకు కింది ఉండే పదునైన భాగం తిమింగలాన్ని చీల్చకుంటూ పోవడం వల్ల ఈ భారీ ప్రాణి మరణించి ఉంటుందని గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని బెర్హంపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేసీ సాహు తెలిపారు. స్పెర్మ్ తిమింగలం దంతాలు ప్రపంచలోనే అతిపెద్దవన్న విషయం అందరికీ తెలిసిందే. 2,250 మీటర్ల లోతుకు కూడా వెళ్లగలగడం వీటి ప్రత్యేకత. సాధారణంగా సముద్ర తాబేళ్లు ఎక్కుగా ఈ తీరానికి వస్తుంటాయని ప్రొఫెసర్ వివరించారు. తిమింగలం చినిపోవడానికి అసలు కారణాలేంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.