తమిళ సంక్షోభం కాంగ్రెస్‌కు తగిలింది
తమిళ సంక్షోభం కాంగ్రెస్‌కు తగిలింది
Published Fri, Feb 10 2017 5:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చెన్నై: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడిఎంకేలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఏర్పడిన సంక్షోభం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీసింది. ఇరువురిలో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యులు గల రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసర్ బహిరంగంగా శశికళకు మద్దతు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలు సహా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విభేదిస్తున్నారు.ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి శశికళను ఆహ్వానించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును తిరునవుక్కరసర్ విమర్శించడంతో ఎనిమిది మంది కాంగ్రెస్ శాసన సభ్యుల్లో ఆరుగురు విభేదించినట్లు రాష్ట్రానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడొకరు తెలియజేశారు.
రాష్ట్రంలో డీఎంకేతోని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ అనుబంధం ఉన్నప్పుడు ఏఐడీఎంకేలో ఓ పక్షానికి మద్దతు ఎలా ఇస్తామంటూ గురువారం జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశంలో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెల్సింది. పైగా శశికళను ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారట. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు రెండుగా చీలిపోయినప్పుడు ఒక పక్షం వహించక తప్పదన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తం అయినట్లు తెల్సింది. ఇరువురు మధ్య బలపరీక్ష జరిగినట్లయితే సభా విశ్వాసం కోసం 117 సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయ పరిణామాలను రాహుల్ గాంధీతో చర్చించేందుకు తిరునవుక్కరసర్ శుక్రవారం బయల్దేరి ఢిల్లీ వెళ్లినట్లు తెల్సింది. ఆయన విద్యాసాగర్ రావును విమర్శించిన నేపథ్యంలోనే కేంద్ర కేంగ్రెస్ కమిటీ కూడా గవర్నర్ పాత్రను విమర్శించింది.
కేంద్రంలోని బీజేపీ జోక్యం కారణంగానే తమిళనాడు ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిందని కూడా ఆరోపించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు గవర్నర్ నిరీక్షించాలంటూ చిదంబరం విజ్ఞప్తి చేయడం ద్వారా భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ చనిపోయినప్పుడు ఇలాంటి సంక్షోభమే ఏర్పడగా, అప్పడు ఏఐఏడిఎంకేలో ఉన్న తిరునవుక్కరసర్, జయలలిత పక్షం వహించారు. ఆ తర్వాత ఆయనకు జయలలితతో విభేదాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాలపై రాహుల్‌తో చర్చించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పన్నీర్ సెల్వం, శశికళలలో గవర్నర్ ఎవరిని బలపరీక్షకు పిలిచినా విమర్శించే అవకాశం కాంగ్రెస్‌కు ఎలాగు ఉంటుంది.
Advertisement