సీఎం కాబోయి.. విపక్ష నేతగా!
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంకే స్టాలిన్ (63) అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే తమ శాసనసభాపక్ష నేతగా స్టాలిన్‌ను డీఎంకే ఎన్నుకొంది. దాంతో ఆయన విపక్షనేత కావడం లాంఛనంగానే మిగిలింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో డీఎంకే 89 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. డీఎంకే విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రి పదవి చేపడతానని కరుణానిధి ప్రకటించారు. అయితే 93 ఏళ్ల కరుణానిధి తర్వాత సీఎం అయ్యేది స్టాలినేనన్నది పార్టీ నాయకులు, కార్యకర్తల భావన. ఇక ఊహించని రీతిలో అన్నాడీఎంకే మళ్లీ గెలవడంతో కరుణ ఆశలు అడియాసలయ్యాయి.
దాంతో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని కూడా ఆయన వద్దనుకుని, కొడుక్కి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మంగళవారమే పార్టీ ఎమ్మెల్యేలు స్టాలిన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 2006 వరకు కరుణానిధి విపక్ష నేతగా ఉండేవారు. కానీ, 2011లో డీఎండీకేకు ఎక్కువ స్థానాలు రావడంతో విజయ కాంత్ విపక్ష నేత అయ్యారు. 1996 నుంచే డీఎంకేలో అళగిరిని కాదని స్టాలిన్‌ను పైకి తెచ్చేందుకు కరుణానిధి మొగ్గుచూపారు. 1989లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన స్టాలిన్.. ఇప్పుడు వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.