ప్రతిపక్షనేతగా స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా డీఎంకే కోశాధికారి, కొళత్తూరు ఎమ్మెల్యే స్టాలిన్ ఎన్నికయ్యారు. పలువులు ఎమ్మెల్యేలు ఆయన పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షులు కరుణానిధి అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాలతో అన్నాడీఎంకే అధికారాన్ని చేపట్టగా, డీఎంకే 89 సీట్లను గెలుపొంది అధికార పార్టీ తరువాత అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ఈ నేపథ్యంలో డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కరుణానిధి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10.30 గంటలకు కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్, సహాయ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, జీ పెరియస్వామి, అన్ని జిల్లాల కార్యదర్శులు హాజరైనారు. అలాగే కొత్తగా ఎన్నికైన డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కరుణానిధి ప్రకటించారు. ప్రతిపక్ష సహాయ నేతగా దురైమురుగన్, చీఫ్ విప్‌గా చక్రపాణి, విప్‌గా పిచ్చాండి సైతం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
కేంద్రం కుట్ర వల్లనే డీఎంకే ఓటమి:
కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే తమ పార్టీ ఓటమి పాలైందని డీఎంకే కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా ఆరోపించింది. ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే జయలలితను ప్రధాని నరేంద్రమోదీ అభినందిస్తున్నట్లుగా టీవీల్లో వార్త ప్రసారం కావడాన్ని ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం కుమ్మక్కుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి లెక్కింపు పూర్తయ్యేవరకు ఎన్నికల కమిషన్ చర్యలు అన్నాడీఎంకేకు అనుకూలంగా, పక్షపాతంగానే కొనసాగాయి.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీల్లో పట్టుబడిన రూ.570 కోట్లపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉండగా, వాటిని లెక్కచేయకుండా బ్యాంకు సొమ్ముగా తేల్చేయడం వెనుక కేంద్రం అండ ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే రూ.570కోట్లపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే డిమాండ్ చేసింది. పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన నేతలు చేసిన 20 తీర్మానాల వివరాలు ఇలా ఉన్నాయి. గ డచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 4 కోట్ల 32 లక్షలా 62వేల 906 ఓట్లను పొందడం ద్వారా 39.7 ఓట్లను సాధించింది.
గత 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఒక కోటి 35లక్షల 13వేల 816 ఓట్లను పొందింది. గత ఎన్నికల ఓట్లతో పోల్చుకుంటే ప్రజల్లో డీఎంకే పట్ల అపారమైన నమ్మకం పెరిగింది. 1957 నుండి 2016 వరకు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి వరుసగా 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. అంతేగాక ఈ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీని సాధించారు. నమక్కునామే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి లక్షలాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న స్టాలిన్‌కు అభినందనలు. వైద్యకోర్సుకు ప్రవేశపరీక్షలు ఈ ఏడాది మాత్రమే కాదు ఇక ఎప్పటికీ ఉండబోవని వెంటనే ప్రకటించాలి. ఏపీలో 20 మంది తమిళులను ఎన్‌కౌంటర్ చేయడంపై సాగుతున్న కేసు విచారణ, అన్నాడీఎంకే నేత అన్బునాథన్ ఫాంహౌస్‌లో భారీ ఎత్తున నగదు దొరకడంపై సీబీఐ విచారణ జరిపించాలని తీర్మానాలు చేశారు.
ఓటమికి కరుణే కారణం: సుబ్రమణ్యస్వామి
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికి ఆ పార్టీ అధ్యక్షులు కరుణానిధే కారణమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. స్టాలిన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగానే ప్రకటించి ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని అన్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడినా అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు. కరుణానిధి ఇక నైనా రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు.