సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ప్రకటించగా, ఒడిశా 12 లక్షలు పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.21 లక్షల పరిహారం ఇస్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ప్రకటించగా, రూ.12 లక్షల పరిహారం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. (పాలం ఎయిర్‌బేస్‌లో అమర జవాన్లకు నివాళి)
హిమాచల్ ప్రదేశ్ రూ.21 లక్షలు పరిహారం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి అమరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని పలు ప్రభుత్వాలు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులైన జవాన్లకు నివాళి అర్పించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. (ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని)
Comments
Please login to add a commentAdd a comment