
సాక్షి, హైదరాబాద్: పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. జవాన్ల మరణం తనను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన వారికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతికి వ్యక్తం చేస్తూ.. తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బంజారాహీల్స్‌లోని సీఆర్‌పీఎఫ్ సధరన్ హెడ్ క్వార్టర్స్‌లో ఐజీపీ రాజుకు చెక్కును అందచేశారు.
తన స్నేహితులు మరో 25 లక్షలు ఇచ్చారని, మొత్తం 50 లక్షల రూపాయలను అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా కేటీఆర్ చెల్లించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా తాను ఇక్కడికి రాలేదని సాధారణ భారత పౌరుడిగా మాత్రమే వచ్చినట్లు తెలిపారు. భద్రతా బలగాల సేవల వల్లనే దేశ ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారని, వారి త్యాగాలను ఎన్నటికీ మరువలేవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అసువులుబాసిన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.