
'బెదిరించడం కాదు వారిని అర్థం చేసుకోండి'
న్యూఢిల్లీ: దేశంలో మత అసహనముందంటూ బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. తమను ప్రశ్నించేవారిని వేధించడం, బెదిరించడం, అగౌరవపరచడం కేంద్ర ప్రభుత్వం మానుకుంటే మంచిదని ఆయన సూచించారు. దానికంటే దేశ ప్రజలకు చేరువై.. వారు ఎందుకు అశాంతికి గురవుతున్నారో అర్థం చేసుకోవాలని మంగళవారం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
'ప్రభుత్వాన్ని, మోదీజీని ప్రశ్నించేవారిపై దేశద్రోహులుగా, దేశభక్తిలేనివారిగా, ఇతరత్రా ప్రేరేపకులుగా ముద్రవేయడం కంటే ప్రభుత్వం ప్రజల మనస్సులను అర్థం చేసుకొని.. వారిని అశాంతికి గురిచేస్తున్నదేమిటో తెలుసుకోవడం మంచిది' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'భారత్ లో సమస్యల పరిష్కారానికి అదే మార్గం. అంతేకానీ వేధించడం, బెదిరించడం, అగౌరవపరచడం కాదు' అని ఆయన తెలిపారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ... మత అసహనంపై తాను ఆందోళనకు గురయ్యానని అమీర్ ఖాన్ అన్నారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆయన చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది.