
'రాహుల్ గాంధీ నన్ను కాపీ కొడుతున్నారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు తన ఉపన్యాసాల శైలిని కాపీ కొడుతున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. 'ఉపన్యాసాలు, ప్రసంగాలు ఇచ్చేటప్పుడు నాకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. అమేథిలో నేను ప్రసంగించిన విషయాలైమైనా మీరొసారి చూస్తే.. మీకు ఆ విషయం స్పష్టమవుతుంది. ఆశ్చర్యకరంగా నా తరహా మాట్లాడే శైలి రాహుల్ గాంధీలోనూ కనిపిస్తున్నది' అని ఆమె పేర్కొన్నారు. ఓ ఆంగ్ల చానెల్‌తో సరదాగా మాట్లాడిన స్మృతి ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ మిమ్మల్ని అనుకరిస్తున్నారా అన్న ప్రశ్నకు నవ్వుతూ.. 'అది నేనేమి ప్రశంసగా తీసుకోనం'టూ బదులిచ్చారు.
అయితే అది జోక్ మాత్రమేనని తర్వాత చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అమేథిలో రాహుల్‌ను సవాల్ చేసిన స్మృతి ఇరానీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్ కావాలంటే తన చొక్కా చేతులను ఎంతవరకైనా మడుచుకోవచ్చునని, ఏమైనా మాట్లాడే హక్కు ఆయనకు ఉందని స్మృతి చెప్పారు. అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో సహనం ఉంది కాబట్టే ఒక కేంద్రమంత్రి సమక్షంలో ప్రజావేడుకలో ఆమిర్ ఆ మాటలు మాట్లాడగలిగారని ఆమె అన్నారు.