మొక్కల విప్లవానికి..సాంకేతిక రెక్కలు | Story On Team Trees | Sakshi
Sakshi News home page

మొక్కల విప్లవానికి..సాంకేతిక రెక్కలు

Published Fri, Nov 8 2019 5:20 AM | Last Updated on Fri, Nov 8 2019 5:20 AM

Story On Team Trees - Sakshi

టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి...యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల విషయమూ ఇంతే! అబ్బే.. వాటితో నష్టమే ఎక్కువగానీ.. లాభాలేమున్నాయ్‌ అంటారా? చాలానే ఉన్నాయి. తాజా ఉదాహరణ... కొంతమంది యూట్యూబర్లు కలిసికట్టుగా భూమ్మీద పచ్చదనం పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం.

అలా మొదలైంది... 
2019 మే నెలలో జిమ్మీ డొనాల్డ్‌సన్‌ అలియాస్‌ మిస్టర్‌ బీస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా చాలామంది ఛానల్‌ సబ్‌స్క్రైబర్లు ఆయనకు సరదాగా ఓ సవాలు విసిరారు. ‘ఛానల్‌లో స్టంట్లు గట్రా చూపించడం కాదు.. ఓ రెండు కోట్ల మొక్కలు నాటి చూపించు’అని ట్విట్టర్, రెడ్డిట్, ఫేస్‌బుక్‌వంటి అనేక సామాజిక మాధ్యమాల్లో వెంట పడ్డారు. ‘‘అఫ్‌కోర్స్‌ భేషుగ్గా చేసేస్తా. చూస్తూ ఉండండి’’అని మిస్టర్‌ బీస్ట్‌ అంగీకరించడంతో కథ మొదలైంది. ‘ఎవరో ఒకరు... ఎప్పుడో అపుడు’అంటూ ముందుకు నడుస్తూ.. కొద్ది రోజుల్లోనే తనలాంటి యూట్యూబర్లు సుమారు 600 మందిని పోగేశాడు.

అందరి లక్ష్యం ఒక్కటే.. రెండు కోట్ల మొక్కలు నాటాలి! సంకల్పం చెప్పుకున్నదే తడవు.. అందరూ తమతమ ఛానళ్ల సబ్‌స్క్రైబర్లకు విజ్ఞప్తులు పెట్టడం మొదలుపెట్టారు. మీరిచ్చే ఒక్కో డాలర్‌ విరాళానికి ఒక్కో మొక్క నాటేస్తాం. ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ దేశాల్లో పచ్చదనాన్ని పెంచేస్తామన్న యూట్యూబర్ల వినతులకు స్పందించి ఇప్పటికే దాదాపు 80 లక్షల డాలర్లు విరాళాలుగా వచ్చేశాయి కూడా!

జనవరి ఒకటి విడుదల... 
టీమ్‌ ట్రీస్‌ ప్రాజెక్టు వచ్చే జనవరి ఒకటవ తేదీన ప్రారంభం కానుంది. ఇందుకోసం అమెరికాలో యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్బర్‌ డే ఫౌండేషన్‌ సహకారం తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటిన ఈ స్వచ్ఛంద సంస్థ రెండేళ్లలో ట్రీమ్‌ ట్రీస్‌ ప్రాజెక్టునూ పూర్తి చేయాలని భావిస్తోంది. నాటిన ప్రతి మొక్క బతికి... ఏపుగా పెరిగేందుకు ఈ సంస్థ ఆయా దేశాల అటవీ శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయనుంది. అమెరికాలో నేషనల్‌ పార్క్‌ సర్వీస్, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫారెస్టర్స్‌లు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి.

ఆయా ప్రాంతాల్లో పెరిగే మొక్కలను మాత్రమే నాటుతామని, ఒకే రకమైన మొక్కలు కాకుండా.. జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు వీలైనన్ని ఎక్కువ జాతులను పెంచడం తమ లక్ష్యమని ఆర్బర్‌ డే ఫౌండేషన్‌ చెబుతోంది. అంతేకాదు.. అత్యాధునిక డ్రోన్‌ టెక్నాలజీతో మొక్కల విత్తనాలను వేగంగా... ఎక్కువ విస్తీర్ణంలో వెదజల్లేందుకు టీమ్‌ ట్రీస్‌ ‘డ్రోన్‌ సీడ్‌’అనే సంస్థ సేవలూ వినియోగించుకుంటోంది. చిన్న డ్రోన్లతో భూమిని సర్వే చేయడం.. ఆ తరువాత పెద్ద సైజు డ్రోన్లు విత్తనాలు, పోషకాలతో కూడిన సీడ్‌బాంబ్స్‌ను ప్రయోగిస్తాయన్నమాట.

యువతరం కదం తొక్కితే... 
‘‘మా తరంపై చాలామంది జోకులేస్తుంటారు.. మాటల రాయుళ్లే కానీ.. చేతలు అస్సలు ఉండవని. ట్వీట్లను రీట్వీట్‌ చేయడమే మీ యాక్టివిజమ్‌ అనీ అంటుంటారు. ఇవన్నీ తప్పని నిరూపించేందుకు ఇదే మంచి సమయం’.. ఇటీవల జిమ్మీ పెట్టిన ఓ వీడియో సారాంశమిది. జిమ్మీ వ్యాఖ్యలు అందరికీ స్ఫూర్తిదాయకమే. ‘రెండు కోట్ల మొ క్కలు నాటితే వాతావరణ మార్పుల సమస్యలన్నీ తీరిపోతాయని మేమేమీ అనుకోవడం లేదు. కాకపోతే ఏమీ లేని దానికంటే ఇది మేలన్నది మా అభిప్రాయం’ అంటారు జిమ్మీ.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

ఎందరో మహానుభావులు... 
టీమ్‌ ట్రీస్‌ ప్రయత్నాల్లో భాగంగా అక్టోబరు 25న వెబ్‌సైట్‌ ప్రారంభమైందో లేదో.. 48 గంటల్లోనే అరవై లక్షల డాలర్ల విరాళాలు వచ్చిపడ్డాయి. ఇందులో 17.5 లక్షలు యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్ల నుంచే వచ్చాయి. టెస్లా కార్ల కంపెనీ యజమాని, స్పేస్‌ఎక్స్‌ అధిపతి, హైపర్‌లూప్‌ రవాణా డిజైనర్‌ కూడా అయిన ఇలాన్‌ మస్క్, షాపిఫై యజమాని టోబీ లోరాక్స్‌ ఇంకో 20 లక్షల డాలర్లు అం దించారు. నిధుల సేకరణకు ఐర్లాండ్‌ యూట్యూబర్‌ జాక్‌సెప్టిక్‌ఐ 8 గంటలపాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా 1.5 లక్షల డాలర్లు సేకరించగా.. గేమింగ్‌ యూట్యూబర్‌ ఒకరు ఫోర్ట్‌నైట్‌ గేమ్‌ టోర్నమెంట్‌ నిర్వహించి గేమ్‌లో ఒక్కో కిల్‌కు పది డాలర్లు చొప్పున విరాళం సేకరించా డు. ఓ ఛానల్‌.. మొక్కలు నాటే ఫిరంగి తయారీ ప్రయత్నాల్లో ఉంది. టీమ్‌ ట్రీస్‌ ప్రాజెక్టుకు ఆద్యుడైన మిస్టర్‌ బీస్ట్‌ లక్ష డాలర్ల విరాళమివ్వడం కొసమెరుపు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement