
చెన్నై చిన్నాభిన్నం
చెన్నై: వర్దా తుపాను ధాటికి చెన్నై మహానగరం చిగురుటాకులా వణికింది. తుపాను కారణంగా వీచిన ప్రచండ గాలులతో తమిళనాడు రాజధాని చిన్నాభిన్నమైంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో భవనాలు, వాహనాలపై చెట్లు కుప్పకులాయి. కార్లు తిరగబడ్డాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు రహదారులపై అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. తిరువళ్లూరు పళవేర్కాడులో సముద్రం ముందుకు వచ్చింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏడు ఎన్డీఆర్‌ఎఫ్, రెండు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వర్దా తుపాను కారణంగా ఇప్పటివరకు చెన్నైలో ఏడుగురు మృతి చెందారు.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]