విద్యుత్‌శాఖకు రూ.1.5 కోట్లు నష్టం
Published Wed, Dec 14 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
నెల్లూరు (టౌన్) : వర్దా తుపాన్ విద్యుత్‌శాఖకు నష్టం తెచ్చిపెట్టింది. గత రెండు రోజులుగా జిల్లాలో భారీ గాలులతో కురిసిన వర్షం కారణంగా ఽవిద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో తీగలు తెగిపోయాయి. అక్కడక్కడ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పాడైపోయినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా తుపాను కారణంగా శాఖకు రూ.1.5 కోట్లు మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సూళ్లూరుపేట, నాయుడుపేట, తడతో పాటు తీరప్రాంత గ్రామాల్లో ఎక్కువ నష్టం జరిగింది. 33 కేవీ లైనుకు సంబంధించి 50 స్తంబాలు, 11 కేవిలైన్‌కు సంబంధించి 212 స్తంభాలు, ఎల్‌టీ సెక్షనుకు సంబంధించి 312 స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ్‌జైన్ ఆదేశాలతో ట్రాన్స్‌కో సీఈ నందకుమార్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ఉండి పనులను పర్యవేక్షించారు. జిల్లాలో 90 శాతంకు పైగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తీరప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఇంకా కరెంట్ లేదు. వాటికి బుధవారం నాటికి సరఫరాను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఎన్‌జీఆర్‌ఎస్ సహాయక బృందాలు కూడా విద్యుత్‌శాఖ సిబ్బందికి సహకరించడంతో యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేశారు.
Advertisement