వర్దా బీభత్సానికి చెన్నై పరిస్థితి ఎలా ఉందంటే..
తీవ్ర తుఫాను వర్దా సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైన చెన్నపట్నం ఒక్కసారిగా ఓ అడవిలో మారిపోయింది.
తీవ్ర తుఫాను వర్దా సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైన చెన్నపట్నం ఒక్కసారిగా ఓ అడవిలో మారిపోయింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు కూకటివేళ్లతో సహా పెద్దపెద్ద వటవృక్షాలు నేలకొరిగాయి. దీంతో ఎక్కడ చూసినా నేలకూలిన చెట్లే దర్శనిమిస్తున్నాయి. ఈ గాలుల ధాటిని బహుళ అంతస్తుల భవంతులను సైతం తట్టుకోలేకపోయాయి. చెన్నపట్నంలో ఎక్కడచూసినా పడిపోయిన చెట్లే కనిపిస్తుండటంతో, మధ్యస్థ అడవిలో ఉన్న మాదిరి అనిపిస్తోందని చెన్నపట్నం వాసులు చెబుతున్నారు. ఈ తుఫాను సృష్టించిన బీభత్సానికి 4,000కు పైగా చెట్లు నేలకొరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం చెప్పారు. నివాస ప్రాంతాల్లో కూలిన చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
లేచిన దగ్గర్నుంచి కాంపౌండ్లో విరిగిన, కూలిన చెట్లను తొలగించడం ప్రారంభించామని చెప్పారు. రోడ్లపై కూలిన చెట్ల వల్ల చాలా వాహనాలు వాటి కిందే నలిగిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ప్రధాన రహదారులపై పడిపోయిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. కానీ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కూడా చెట్లను తొలగించాలంటే మరో రెండు రోజుల పాటు సమయం పట్టే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. బస్సు సర్వీసులు ఎప్పటిమాదిరిగా సాధారణ స్థాయిలో నడవాలంటే మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో అన్నీ విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దుకాణాలు, హోటల్స్ తెరుచుకున్నాయి.