
ప్రతీకాత్మకచిత్రం
లాక్‌డౌన్ వేళ బలవన్మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో చోటుచేసుకున్న 300కి పైగా మరణాల్లో ఆత్మహత్యలే అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. లాక్‌డౌన్ కారణంగానే మార్చి 19 నుంచి మే 2 వరకూ 338 మరణాలు సంభవించాయని సామాజిక శాస్త్రవేత్త తేజేష్ జీఎన్, సామాజిక కార్యకర్త కనికా శర్మ, గ్లోబల్ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ అమన్‌లతో కూడిన పరిశోధక బృందం వెల్లడించింది. వీరిలో 80 మంది ఒంటరితనం, వైరస్ బారినపడతామనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డారని, ఇక స్వస్ధలాలకు వెనుతిరిగి వస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదాల్లో 51 మంది వలస కూలీలు మరణించారని ఈ సర్వే తెలిపింది.
ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో 36 మంది మరణించారని, మరో 45 మంది మద్యానికి బానిసై తనువు చాలించారని పేర్కొంది. ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయం, ఒంటరితనం, మద్యం లేకపోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని సర్వే విశ్లేషించింది. మద్యం బారిన పడి దాన్ని అధిగమించేందుకు శానిటైజర్లు, ఆఫ్టర్ షేవ్ లోషన్లు తాగి ఏడుగురు మరణించారని పేర్కొంది. ఇక కుటుంబ సభ్యులకు దూరంగా క్వారంటైన్ సెంటర్లలో చిక్కుకున్న వలస కూలీలు ఒంటరితనంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని సర్వే తెలిపింది. ఇక కరోనాయేతర మరణాల్లో దూరప్రాంతాలకు కాలినడకన బయలుదేరిన వలస కూలీల్లో 24 మంది తీవ్ర అలసటతో మరణించగా, రేషన్ షాపుల వద్ద పొడవాటి క్యూల్లో నిల్చుని, పోలీసులతో పాటు, మూక దాడి ఘటనల్లో 11 మంది కన్నుమూశారని, వైద్య సాయం అందక 38 మంది మరణించారని నిపుణుల గ్రూప్ వెల్లడించింది.