
ఆ సీఎం.. కుక్కతోక లాంటివారు: స్వామి
చాలా రోజులుగా నోరు మెదపకుండా ఉన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి.. మళ్లీ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈసారి జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆయన లక్ష్యం అయ్యారు. పీడీపీ అధినేత్రి అయిన మెహబూబా.. కుక్కతోక లాంటి వారని, వాళ్లను సరిచేయడం కుదరని పని అని అన్నారు. ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయనీ కామెంట్లు చేశారు. ఆమెను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి బదులు కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా అన్నారు.
మెహబూబా ముఫ్తీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని.. ఆమె మారుతారని భావించడం వల్లే ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని స్వామి అన్నారు. కశ్మీర్‌లో సామాన్య పరిస్థితులను పునరుద్ధరించేందుకు పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి కృషిచేస్తున్న తరుణంలో స్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జూలై 8వ తేదీన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాతి నుంచి కశ్మీర్ అల్లకల్లోలంగా మారింది.