శశిథరూర్పై సిట్ బృందం ప్రశ్నల వర్షం
సునందాపుష్కర్ హత్యకేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను ఢిల్లీ పోలీసులు ఏకంగా నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ జట్టు భాగస్వామ్యంపైనే ప్రధానంగా ఈ ప్రశ్నలవర్షం కురిపించినట్లు తెలుస్తోంది. థరూర్తోపాటు వాళ్ల ఇంటి పనిమనిషి నారాయణ్ సింగ్, డ్రైవర్ బజరంగ్ తదితరులను సిట్ బృందం గురువారం పిలిపించింది. 2014 జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ తానున్న హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులు ఏర్పాటుచేసిన సిట్ బృందం హత్యకేసును ఈ సంవత్సరం జనవరి 1న నమోదుచేసింది.
ఈ కేసులో గురువారం ఉదయం 11.30కు థరూర్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అది ఏకబిగిన నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. తొలుత థరూర్ సరోజిని నగర్ పోలీసు స్టేషన్కు వెళ్లగా, అక్కడినుంచి ఆయన్ను వసంత విహార్ స్టేషన్కు తరలించి, అక్కడే ప్రశ్నించారు. అదనపు డీసీపీ పీఎస్ కుష్వాహా నేతృత్వంలోని సిట్ బృందమే ఆయన్ను ప్రశ్నించింది. ఇప్పటివరకు ఈ కేసులో సిట్ బృందం 15 మందిని ప్రశ్నించింది. సునంద కుమారుడు శివ్ మీనన్ను కూడా ఫిబ్రవరి 5న 8 గంటల పాటు ప్రశ్నించారు.