
గోధుమ, పప్పులకు ‘మద్దతు’
► కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం
► గోధుమలకు రూ.100, పప్పుధాన్యాలకు రూ.550 వరకు
న్యూఢిల్లీ: రబీ సాగు పెంపు,, ధరల నియంత్రణకు కేంద్రం గోధుమలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు క్వింటాల్‌కు రూ.100, పప్పు ధాన్యాలకు రూ.550 వరకు పెంచింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం సమావేశమై 2016-17 రబీ పంటలపై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత ఏడాది రూ.1,525గా ఉన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,625 చేసింది. శనగలకు మద్దతు ధరను బోనస్‌తో కలిపి రూ.500 పెంచి రూ.4 వేలు చేశారు. గతంలో ఇది రూ.3,500గా ఉంది. ఆవాలకు ప్రస్తుతం రూ.3,350 ఉన్న ఎంఎస్పీని రూ.350 పెంచి రూ.3,700 చేశారు. ఆవాలకు రూ.400 పెంచడంతో మద్దతు ధర రూ.3,700కి చేరింది.
బార్లీ గింజల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.100 పెంచడంతో అది రూ.1,325కు చేరింది. కుసుమలకు మద్దతు ధరను రూ.400 పెంచడంతో అది రూ.3,700కు చేరింది. ఎర్ర కందిపప్పుకు రూ.550 పెంచి రూ. 3,950 చేశారు. గత ఏడాది ఈ ధర రూ.3,400గా ఉంది. శనగలు, ఎర్ర కందిపప్పుకు మద్దతు ధరను రూ.4వేలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇలాచేస్తే రబీ సాగు పెరగడంతోపాటు ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపింది.
గోధుమలకు 6.6 శాతం పెంచామని, అయితే ఇది బోనస్‌తో కలిపి 8.2 శాతం అవుతుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. శనగలకు 14.3 శాతం, ఎర్ర కందిపప్పుకు 16.2, ఆవాలకు 10.4, కుసుమలకు 12.1 శాతం పెంచారన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు మద్దతు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మంచి వర్షాలు పడినందున 20.75 మిలియన్ టన్నులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కేబినెట్ నిర్ణయాలు: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్టవ్యతిరేక సంస్థగాప్రకటించాలని కేబినెట్ నిర్ణయి0ది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నదుల అనుసంధాన స్పెషల్ కమిటీకి చట్టబద్దత కల్పించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.