న్యూఢిల్లీ : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. షెడ్యూల్ అడ్జస్ట్మెంట్పై యాజమాన్యాలు దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎన్టీయూహెచ్ తమకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని, తద్వారా ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో తమ కాలేజీల పేర్లను చేర్చకపోవడం వల్ల అన్యాయం జరిగిందని దాదాపు 40 కాలేజీల యాజమాన్యాలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో గంటపాటు వాదనలు కొనసాగాయి. ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తయ్యేందుకు సమయం సరిపోదని న్యాయస్థానం అభిప్రాయపడింది. 60 రోజుల్లో సిలబస్ ఎలా పూర్తి చేస్తారని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించింది.
క్లాసులు, పరీక్షలకు సంబంధించి తాజా షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించింది. రోజుకు 7.30 గంటలు, 75 రోజుల పాటు క్లాసులు నిర్వహించాలని నిబంధనలు ఉండగా, కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన ప్రస్తుత షెడ్యూల్ తమకు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.