షరతులువర్తిస్తాయి
ఎంసెట్ రెండో విడత అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచేందుకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు అనుమతించింది. అయితే ఇందుకు పలు షరతులు విధించింది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని పేర్కొంది. ఇదివరకే అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులుగా తేల్చింది. గత విద్యా సంవత్సరంలో జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు కలిగి, ఈసారి గుర్తింపు నిరాకరణకు గురై.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతి మాత్రం ఉన్న కాలేజీలకే ఈ తీర్పు వర్తిస్తుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. అలాగే తొలి సెమిస్టర్ తరగతులను వచ్చే జనవరి 30 వరకు నిర్వహించేం దుకు సమ్మతించింది. గుర్తింపు రద్దు చేసి ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తమను తొలగించారని, రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతినిచ్చి తమకు న్యాయం చేయాలంటూ 44 కాలేజీలు పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. రెండు రోజులుగా వాదనలు విన్న జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేతో కూడిన ధర్మాసనం బుధవారం కూడా ఈ కేసును విచారించింది. రెండో విడత అడ్మిషన్లకు అనుమతినిస్తే ఇంతవరకు జరిగిన జాప్యానికి తగినట్లు సిలబస్ పూర్తి చేసేలా తరగతుల షెడ్యూల్ సమర్పించాలని కోర్టు ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం సమర్పించిన షెడ్యూల్‌పై ధర్మాసనం పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పిటిషనర్లు తాజాగా సవరించిన షెడ్యూల్‌ను కోర్టుకు అందజేశారు. ఇదే విషయాన్ని బుధవారం విచారణ మొదలు కాగానే కాలేజీల తరఫు న్యాయవాది ఆర్ దావన్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. తాజాగా రూపొందించిన షెడ్యూలులో నిబంధనలకంటే ఐదు పని గంటలే తక్కువగా ఉన్న కారణంగా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం తీర్పు వెల్లడించారు.
174 కళాశాలలకే కౌన్సెలింగ్
ఈ ఉత్తర్వుల ప్రకారం ‘2014-15 సంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌కు 174 పైచిలుకు కళాశాలలను జే ఎన్టీయూహెచ్, తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. వర్సిటీ చెబుతున్న ప్రకారం ఈ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించలేదు. మౌలిక వసతులు లేవని వర్సిటీ చెబుతోంది. అయితే వీటికి ఈ విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఉంది. అలాగే వీటిని కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు కూడా ఆదేశాలిచ్చినట్లు మా ద ృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు వీలుగా ప్రస్తుత ఉత్తర్వులను జారీచేస్తున్నాం. 2013-14కు అనుబంధ గుర్తింపు కలిగి, 2014-15కు అనుబంధ గుర్తింపు పొందలేక, కేవలం ఏఐసీటీఈ అనుమతి మాత్రమే కలిగి ఉన్న కళాశాలలను.. అంటే తొలి కౌన్సెలింగ్‌లో పాల్గొనని 174 పైచిలుకు కాలేజీలకు ఈ తీర్పు వర్తిస్తుంది. అక్టోబర్ 31న కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేయాలి. నవంబర్ 14 నాటికి ప్రక్రియ పూర్తిచేయాలి. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలి. అలాగే తొలి సెమిస్టర్ తరగతుల బోధనను జనవరి 30 నాటికి పూర్తిచేయాలి. అంటే సుమారు 76 రోజుల సమయం ఉంది. వీటిలో ఆదివారాలు, క్రిస్మస్, డిసెంబర్ 31, జనవరి 1 తేదీలను మినహాయించి.. మిగిలిన రోజుల్లో రోజుకు 8 నుంచి ఎనిమిదిన్నర గంటలు బోధించవ చ్చు. ఈ లెక్కన జనవరి 30 నాటికి 525 గంటలను పూర్తిచేయవచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రిపరేషన్ కోసం సెలవులు ఇవ్వాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు పరీక్షలు నిర్వహించాలి. సెకండ్ సెమిస్టర్ మార్చి 2 నుంచి జూన్ 30 వరకు కొనసాగాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
అనుబంధ గుర్తింపు ఇలా..
‘2014-15కు అనుబంధ గుర్తింపు పొందని కళాశాలలు నవంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు వీలుగా తనిఖీలు చేసుకోవచ్చు. అయితే ఇందుకు యూనివర్సిటీ కాకుండా తెలంగాణలో ఉన్న ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ సంస్థల నిపుణులతో ఏర్పాటుచేసిన ఒక కమిటీని వినియోగించుకోవాలి. (ఆ సంస్థలతో తనిఖీలు చేయించేందుకు వీలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం, వర్సిటీ తరఫు న్యాయవాదులు కోరారు) కళాశాలలు కూడా ఈ తనిఖీలకు సహకరించాలి. తనిఖీలన్నీ పూర్తయ్యాక యూనివర్సిటీ అనుబంధ గుర్తింపునకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించాలి. డిసెంబర్ 31లోగా ఈ నిర్ణయం తీసుకోవాలి. గుర్తింపు నిరాకరిస్తే ఎందుకు నిరాకరించారో కోర్టుకు వర్సిటీ చెప్పాలి. అలాగే గత ఏడాది ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాలి. ఒకవేళ చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోరాదు. మౌలిక వసతులన్నీ ఉండేలా చూడాలి. కానీ 10 కంప్యూటర్లు లేనిచోట 100 కంప్యూటర్లు లేవంటూ రాయకూడదు. కళాశాలలు కూడా వ ర్సిటీ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. అడ్మిషన్లు షరతులపై ఇస్తున్నట్టు విద్యార్థులకు తెలియపరచాలి. ఒకవేళ అనుబంధ గుర్తింపు లభించకపోతే ఫీజును వడ్డీతో సహా వెనక్కిచ్చేందుకు వీలుగా విద్యార్థుల పేరుతో ప్రత్యేక ఖాతా తెరవాలి’ అని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.
కేవలం తెలంగాణకే..
‘ఈ ఉత్తర్వులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తాయి. దీనికి అనుగుణంగా మరే ఇతర రాష్ట్రం కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవకాశం తీసుకోరాదు. అలాగే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కళాశాల మార్చుకునేందుకూ వీలు లేదు. రీ అడ్మిషన్ పొందేందుకు కూడా వీలు లేదు. ఎంసెట్‌లో అర్హత సాధించి అడ్మిషన్ తీసుకోని వారు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75 శాతం ఉండాలి. అలా హాజరు లేని వారిని తదుపరి సెమిస్టర్‌కు అనుమతించకూడదు. తాజా షెడ్యూలును అనుసరిస్తామని కళాశాలలవారీగా ప్రమాణ పత్రం సమర్పించాలి. అనుబంధ గుర్తింపు కోసం ఇచ్చే ప్రమాణ పత్రం, షెడ్యూలు కోసం ఇచ్చే ప్రమాణ పత్రంలో దేనినైనా ఉల్లంఘిస్తే.. తాజా తీర్పును ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తాం. కళాశాలలు తగిన వసతులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నెల గడువు ఇస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘కౌన్సెలింగ్ గడువు పొడిగింపు కేవలం తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుంది. ఇదివరకే అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. రీ అడ్మిషన్‌కు, కళాశాల మార్పునకూ అవకాశం లేదు. గత విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఉండి, ఈసారి గుర్తింపు పొందకుండా.. ఏఐసీటీఈ అనుమతి మాత్రం ఉన్న 174 పైచిలుకు కాలేజీలకు ఈ తీర్పు వర్తిస్తుంది. కోర్టు సూచించిన షరతుల ప్రకారం కౌన్సెలింగ్, తరగతులు నిర్వహించాలి. వసతుల ఏర్పాటుకు నెల గడువిస్తున్నాం. ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ సంస్థల నిపుణులతో కూడిన కమిటీతో తనిఖీలు జరగాలి. చిన్నాచితక కారణాలతో గుర్తింపు రద్దు చేయడం సరికాదు. తనిఖీల తర్వాత అనుబంధ గుర్తింపు రద్దయితే ఆయా కాలేజీల్లోని విద్యార్థుల అడ్మిషన్లు కూడా రద్దవుతాయి. వారి ఫీజులు వడ్డీతో సహా వెనక్కిచ్చేలా ప్రత్యేక ఖాతా నిర్వహించాలి. విద్యార్థులకు ఈ షరతులు ముందే తెలపాలి. తొలి సెమిస్టర్‌లో 75 శాతం హాజరు లేకపోతే రెండో సెమిస్టర్‌కు అనుమతించకూడదు’ - సుప్రీం తీర్పు సారాంశం
న్యాయం మా వెంటే ఉంది
రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాలేజీల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. బుధవారం ఉదయం తీర్పు వెలువడిన తర్వాత కాలేజీల ప్రతినిధులు సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘తీర్పు మావైపే వచ్చింది. దేశంలో న్యాయవ్యవస్థ ఎంతో సమర్థంగా ఉన్నందుకు న్యాయమూర్తులకు, మా న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు అన్ని కళాశాలల్లో చేరవచ్చని తీర్పులో చెప్పారు’ అని తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు తిరుమలరావు అన్నారు. తనిఖీల గురించి తామెప్పుడు భయపడలేదని, ఇప్పటికే రెండుసార్లు తనిఖీలు పూర్తయ్యాయని తెలిపారు. ‘చిన్నచిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మా కాలేజీల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నాం. ఏవిధమైన తనిఖీలు నిర్వహించినా ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతామన్నారు. 43 మైనార్టీ కళాశాలల్లో కేవలం మూడింటికే అనుమతులిచ్చారని, మిగిలిన వాటికి అనుమతులిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ మైనార్టీ కాలేజీల సంఘం ప్రతినిధి కోరారు.
ఇదీ షెడ్యూల్
కౌన్సెలింగ్ నోటిఫికేషన్: అక్టోబర్ 31, 2014
కౌన్సెలింగ్ ముగింపు: నవంబర్ 14, 2014
తరగతులు ప్రారంభం: నవంబర్ 15, 2014
తొలి సెమిస్టర్ బోధన ముగింపు: జనవరి 30, 2015
పరీక్షలకు ప్రిపరేషన్ సెలవులు: ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు
పరీక్షల నిర్వహణ: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు
సెకండ్ సెమిస్టర్ ప్రారంభం: మార్చి 2, 2015
తరగతులు, ప్రిపరేషన్ పూర్తి: జూన్ 30, 2015
పరీక్షల నిర్వహణ: జూలై 1 నుంచి 15 వరకు