రాజీ పడ్డా కొట్టివేత కుదరదు
రేప్, హత్య కేసులపై సుప్రీంకోర్టు రూలింగ్
న్యూఢిల్లీ: అత్యాచారం, హత్యల వంటి తీవ్ర నేరాల్లో నిందితులు, బాధితులు రాజీకి వచ్చి ఆమోదయోగ్య పరిష్కారం కుదుర్చుకున్నా ఆ కేసుల్లోని క్రిమినల్ అభియోగాలను కోర్టులు కొట్టివేయజాలవని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇటువంటి కేసులను కొట్టివేయడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ ఎన్.వి. రమణతో కూడిన ధర్మాసనం తెలిపింది. బాధితులతో రాజీ కుదుర్చుకున్నందున తమపై అభియోగాలను కొట్టివేయాలంటూ వివిధ కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కలిపి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది.
సమాజ ప్రయోజనాలే ముఖ్యం: ఢిల్లీ హైకోర్టు
ఒక మతంలోని ప్రజల ప్రయోజనాలు యావత్ సమాజ ప్రయోజనాలను అధిగమించేందుకు అంగీకరించరాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. జార్ఖండ్‌లోని ఛాత్రాలో ఉన్న అటవీ భూముల్లో జైన మందిర నిర్మాణానికి తెలిపిన సూత్రప్రాయ అంగీకారాన్ని కేంద్రం ఉపసంహరించుకోవడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఒక వర్గం ప్రజలకు ఉపయోగపడే ఆలయం ఏర్పాటుకన్నా వాయు కాలుష్యం బారి నుంచి సమాజాన్ని కాపాడేందుకు అటవీ, పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని తీర్పులో పేర్కొంది.