ఆ భూముల’పై ఇదే చివరి అవకాశం | Supreme Court is the last option for states that have not filed counterfeit SEZ lands | Sakshi
Sakshi News home page

ఆ భూముల’పై ఇదే చివరి అవకాశం

Published Sat, Aug 5 2017 3:54 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆ భూముల’పై ఇదే చివరి అవకాశం - Sakshi

ఆ భూముల’పై ఇదే చివరి అవకాశం

నిరుపయోగ సెజ్‌ భూములపై కౌంటర్‌ దాఖలు చేయని రాష్ట్రాలు
చివరి అవకాశమిస్తూ 8 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: నిరుపయోగంగా ఉన్న స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(సెజ్‌) భూముల వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి అవకాశాన్ని ఇచ్చింది. నిరుపయోగంగా ఉన్న ఈ భూములను వెనక్కి ఇవ్వాలని, వీటిలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ కాకినాడ సెజ్‌ బాధిత రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషన్‌లో మొదటి ప్రతివాదిగా కేబినెట్‌ సెక్రటరీని పెట్టారని, జాబితా నుంచి దీనిని తొలగించాలని కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. గత విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు కౌంటర్‌ దాఖలు చేయలేదు.

న్యాయస్థానం ఇచ్చిన అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోనందున, ఇక విచారణ ముందుకు సాగాలని పిటిషనరు తరఫున న్యాయవాదులు కొలిన్‌ గోన్‌సాల్వేస్, కె.శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌లోని అంశాలతో వారు ఏకీభవించినట్లుగా ధర్మాసనం పరిగణించాలని విన్నవించారు. సెజ్‌లలో 50 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో మొత్తం 20 రాష్ట్రాలు ఉన్నాయని, సెజ్‌ యాజమాన్యాలను ఇందులో ప్రతివాదులుగా చేయలేదని పేర్కొన్నారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కేంద్రాన్ని లక్ష్యంగా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనికి పిటిషన్‌ తరుఫు న్యాయవాది స్పందిస్తూ, సెజ్‌ల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, కేంద్రం అనుమతితో రైతుల వద్ద నిర్ధాక్షిణ్యంగా లాక్కున్నారని, వాటిని నిరుపయోగంగా పెట్టారని వాదించారు. పైగా ఆయా స్థలాలను బ్యాంకుల వద్ద పెట్టి రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ములను ఇతర అవసరాల కోసం మళ్లించారని చెబుతూ.. ఇందుకు సాక్ష్యంగా కాగ్‌ నివేదికను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రాలు కౌంటర్‌ దాఖలు చేసేందుకు చివరి అవకాశాన్నిస్తూ నాలుగు వారాలు గడువు ఇచ్చారు. విచారణను 8 వారాలకు వాయిదావేశారు. తదుపరి దశలో తుది విచారణ జరుపుతామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement