ఎన్నో సున్నితమైన కేసుల్లో కీలక తీర్పులిచ్చిన సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ జీఎస్ సింఘ్వీ బుధవారం పదవీ విరమణ చేశారు.
సంచలనాత్మక 2జీ కేసులో కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ సీజేగా పనిచేసి సుప్రీంకు..
ఎన్నో సున్నితమైన కేసుల్లో కీలక తీర్పులిచ్చిన సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ జీఎస్ సింఘ్వీ బుధవారం పదవీ విరమణ చేశారు. సంప్రదాయవాదిగా పేరున్న ఆయన చివరి రోజు కూడా స్వలింగ సంపర్కంపై తీర్పిచ్చారు. 2007 నవంబర్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ బాధ్యతలు చేపట్టేముందు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. తొలుత 1990లో ఆయన రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్, హర్యానా, గుజరాత్ హైకోర్టుల్లో పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. ఆరేళ్ల పాటు సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేసిన కాలంలో ఆయన ఎన్నో సంచలనాత్మకమైన కేసుల్లో విచారణ నిర్వహించారు. వీటిలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా టేపుల వ్యవహారం ఉన్నాయి. అంతేగాక పదవీ విరమణకు ఒకరోజు ముందు అధికారుల ఎర్రబుగ్గ కార్లపై కూడా తీర్పిచ్చారు. సంచలనం సృష్టించిన 2జీ కేసులో మాజీ మంత్రి రాజాతో పాటు మరికొంత మంది కార్పొరేట్లను కూడా జైలుకు పంపారు.ఆయన చేపట్టిన కొన్ని కేసుల్లో తీర్పు పాఠం వెలువడకుండానే మిగిలిపోయాయి. వాటిల్లో నీరా రాడియాతో పాటు.. మందు ల ధర నిర్ణయం, పోలీసు సంస్కరణలు, గుట్కాపై నిషేధం తదితర కేసులున్నాయి.