న్యూఢిల్లీ: మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వారి కుటుంబాన్ని, న్యాయవాదులను, మానసిక వైద్యుల్ని కలిసే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మరణ శిక్ష పడిన ఖైదీల హక్కుల్ని అన్ని దశల్లోనూ కాపాడాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సాధారణ ఖైదీలకు జైళ్లలో కల్పించే హక్కులనే మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వర్తింపచేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్ మదన్ బి లాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
మరణశిక్ష పడ్డ ఖైదీలను ప్రత్యేక సెల్‌లోనూ, ఏకాంత చెరలోనూ ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జైళ్ల సంస్కరణలు చేపట్టేందుకు సుప్రీం కోర్టు ద్వారా నియమితమైన రిటైర్డ్ జస్టిస్ అమితవరాయ్ కమిటీ ఈ సమస్యను కూడా పరిశీలించాలని ధర్మాసనం ఆదేశించింది. మరణ శిక్ష పడిన ఖైదీపై కనీస మానవత్వాన్ని చూపాలని జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, దీపక్ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది. మరణ శిక్ష పడిన ఖైదీల హక్కులను ప్రతి దశలోనూ పరిరక్షించాల్సిన అవసరముందని కోర్టు స్పష్టం చేసింది.
తాజా తీర్పు ప్రకారం దేశంలోని అన్ని జైళ్లల్లో ఉన్న నియమనిబంధనలకు ఈ మేరకు మార్చుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జైళ్లు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది. జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి పోతుండటం, దేశవ్యాప్తంగా జైళ్ల సంస్కరణలపై రిటైర్డ్ జస్టిస్ అమితవ రాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 25న నియమించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment