పశ్చాత్తాపం వ్యక్తం చేయండి
* లేకపోతే విచారణ తప్పదు
* ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని, లేనిపక్షంలో పరువునష్టం కేసులో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సంఘ్ పేరును ప్రస్తావించకుండా యావత్తు సంస్థపైనే ఏకంగా నేరారోపణలు చేయకూడదని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్‌ల బెంచ్ పేర్కొంది. ఆరోపణలు చేసేటప్పుడు ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలంది. సంఘ్ కార్యకర్త రాజేష్ కుంతే మహారాష్ట్రలోని ఓ కోర్టులో తనపై వేసిన పరువునష్టం దావాను కొట్టేయాలని రాహుల్ వేసిన పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది.
స్వేచ్ఛపై ఆంక్షల్లేవని, అయితే పరువునష్టం కలిగించే వ్యాఖ్యలకు పరిమితులున్నాయని వ్యాఖ్యానించింది. ‘రచయితలు, రాజకీయవేత్తలు, విమర్శకులు ఏం మాట్లాడినా.. మీరు మాత్రం సంయమనంతో వ్యవహరించాలి. మీరు తప్పుడు చరిత్రను ప్రస్తావిస్తూ ఎందుకు ప్రసంగించారు? పిటిషనర్ ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 499(పరువునష్టం) కిందకు వస్తాయో, రావో మేం పరిశీలించా’లని పేర్కొంది. తీర్పు ఇప్పటికే ఉందంటూ.. పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోతే విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది.
శాంతిసామరస్యాలు వర్థిల్లాలితప్ప అరాచకం కాదంది. కాగా ప్రభుత్వ రికార్డులు, పంజాబ్-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాహుల్ మాట్లాడారని, సంఘ్ పేరును నేరుగా ప్రస్తావించలేదని రాహుల్ లాయరు హరీన్ చెప్పారు. బెంచ్ స్పందిస్తూ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అనే హైకోర్టు చెప్పిందని పేర్కొంది. గాంధీని గాడ్సే హత్య చేశారనడానికి, గాంధీని సంఘ్ చంపిందని చెప్పడానికి తేడా ఉందంది. కాగా, రాహుల్ క్షమాపణ చెప్పరని కాంగ్రెస్ స్పష్టం చేసింది.