నిర్భయ దోషులు అక్షయ్, వినయ్, పవన్, ముఖేశ్ (సవ్యదిశలో)
న్యూఢిల్లీ: మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకరైన ముకేశ్ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశ్రయించాడు. అలాగే, తన ఉరిశిక్షపై జారీ అయిన డెత్ వారంట్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టాడు. నిర్భయ దోషులు వినయ్ శర్మ(26), ముకేశ్ కుమార్(32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా(25)లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జనవరి 7వ తేదీన డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిలో ఇద్దరు వినయ్ శర్మ, ముకేశ్ కుమార్‌లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత మంగళవారం సాయంత్రం ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు, వారి ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్యూరేటివ్ పిటిషన్లను నిశితంగా పరిశీలించి, వారి అభ్యర్థనను తోసిపుచ్చాలనే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం వెల్లడించింది.
క్యూరేటివ్ పిటిషన్ శిక్ష పడిన వ్యక్తికి లభించే చట్టబద్ధమైన చివరి అవకాశం. అయితే, ఇప్పటివరకు మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేయలేదు. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నానని, అందువల్ల ఢిల్లీ ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను పక్కనపెట్టాలని ముకేశ్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో క్షమాభిక్ష కోరే తన రాజ్యాంగ హక్కును కోల్పోతానన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టులోని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత ధింగ్రాల ధర్మాసనం నేడు(బుధవారం) విచారించే అవకాశముంది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత మరణశిక్షను అమలు చేసేందుకు కనీసం 14 రోజుల గడువు ఉండాలన్న నిబంధనను ముకేశ్ కోర్టుకు గుర్తు చేశారు.
త్వరలో క్షమాభిక్ష పిటిషన్ వేస్తా
మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ తరఫున సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లను వేస్తానని న్యాయవాది ఆర్పీ సింగ్ వెల్లడించారు. ఈ నలుగురు దోషులపై ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ‘దోషుల తరఫున క్షమాభిక్ష పిటిషన్ వేసిన తరువాత ఈ విషయాన్ని వివరిస్తూ.. ఉరిశిక్ష అమలును నిలిపేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాన’న్నారు. కాగా, వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. వారిని ఉరితీసే జనవరి 22 వ తేదీ తనకు అత్యంత ముఖ్యమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు వద్ద హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి
2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి..
2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి పారామెడిక్ విద్యార్థిని బస్సులో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెను దారుణంగా హింసించిన ఆరుగురు వ్యక్తులు ఆ తరువాత ఆమెను బస్సులో నుంచి రోడ్డుపై విసిరేశారు. అనంతరం, ‘నిర్భయ’గా పేరు పొందిన ఆ బాధితురాలు డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ ఆరుగురు దోషుల్లో నలుగురికి ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను 2017లో సుప్రీంకోర్టు సమర్ధించింది. దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ తిహార్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి అయిన మైనర్ బాలుడు జువనైల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. మిగిలిన దోషుల్లో ముగ్గురు 2018 జూలైలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment