సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ల నుంచి అన్‌లాక్ దశ ముమ్మరం కావడంతో స్వస్ధలాలకు తరలిన కార్మికులు, చిరువ్యాపారులు, ట్రేడర్లు తిరిగి నగరాల బాటపడుతున్నారు. రైల్వే ట్రాఫిక్ పెరిగిన తీరు ఈ వివరాలు వెల్లడిస్తోందని రైల్వే సహాయ మంత్రి సురేష్ అంగది పేర్కొన్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ సమయంలో గ్రామాల బాటపట్టిన కూలీలు, చిరువ్యాపారులు మహా నగరాలకు తిరిగివస్తున్నారని చెప్పారు. ప్రధాన నగరాల్లో సాధారణ పరిస్థితి నెలకొనగానే వారి కుటుంబ సభ్యులు కూడా తిరిగి నగరాలకు చేరకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రాలు కోరితే మరిన్ని రైళ్లను నడుపుతామని, అయితే పలు రాష్ట్రాలు ఇంకా కోవిడ్-19తో పోరాడుతున్నాయని అన్నారు
కాగా రైల్వేలు 31 ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 254 స్పెషల్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నాయని మంత్రి తెలిపారు. మే 12 నుంచి జులై 17 వరకూ ప్రత్యేక రాజధాని రైళ్లు దాదాపు 12 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చాయని, జూన్ 1 నుంచి జులై 17 మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లు 1.6 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చాయని అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్లు 80 శాతం ఆక్యుపెన్సీతో వెళ్లగా, తిరుగుప్రయాణంలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్టు రైల్వేలు గుర్తించాయని మంత్రి తెలిపారు. దీనిప్రకారం కార్మికులు, చిరువ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి స్వస్ధలాలకు వెళ్లి తిరిగి ఒంటరిగా నగరాలకు చేరుకుంటున్నట్టు వెల్లడైందన్నారు. చదవండి: నా భర్త వంట చేస్తాడు... తప్పేంటి?
అన్‌లాక్ 2.0తో ఢిల్లీలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోగా, వైరస్ తాకిడి తీవ్రంగా ఉన్న ముంబై.. బెంగళూర్‌లో ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం కావాల్సిఉందని చెప్పారు. యూపీ, బిహార్, అసోం, రాజస్ధాన్‌ల నుంచి కార్మికులు నగరాలకు చేరుకుంటున్నారని తెలిపారు. బెంగళూర్‌లో బుధవారం లాక్‌డౌన్ ముగియనుండటంతో అక్కడ ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌తో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం రైల్వేలు తమ సర్వీసులను పునరుద్ధరిస్తాయని మంత్రి సురేష్ అంగడి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment