మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే (ఫైల్‌ఫోటో)
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ తరచూ తనకు తాను చాయ్‌వాలాగా చెప్పుకోవడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆక్షేపించారు. మోదీ ప్రధాని కావడం మన దేశ రాజ్యాంగం ఘనతేనని స్పష్టం చేశారు. తాను గతంలో షోలాపూర్ జిల్లా కోర్టులో ప్యూన్‌గా పనిచేశానని, తాను అత్యున్నత స్ధానానికి ఎదగడం మన రాజ్యాంగం చలవేనని నమ్ముతానని చెప్పుకొచ్చారు. తాను ఉన్నత స్థితికి చేరుకోవడంలో తన ఘనతేమీ లేదనే తాను భావిస్తుంటానన్నారు.
పార్టీ తనకు అప్పగించిన అత్యున్నత పదవులను చేపట్టడం తన బాధ్యతగా భావించానన్నారు. ప్రజాస్వామ్యంలో పరిణితితో వ్యవహరించడం అవసరమని, సొంతడబ్బా కొట్టుకోవడం తగదని మహారాష్ట్ర సీఎంగా కూడా వ్యవహరించిన షిండే హితవు పలికారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు నాలుగు తరాల పాటు దేశాన్ని పాలించిన అనంతరం ఓ చాయ్‌వాలా దేశ ప్రధానిగా ఎలా అయ్యాడని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఏ వృత్తీ చిన్నది కాదని, ప్రధాని తరచూ చాయ్‌వాలా అంటూ వారిని తక్కువగా చూసే సంకేతాలు పంపడం సరైంది కాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment