చెన్నై: ప్రముఖ సినీ నటుడు వివేక్‌ను చెన్నై సెమ్మంజేరిలో గల సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సోమవారం ఘనంగా సన్మానించింది. సత్యభామ వర్సిటీలో 24వ స్నాతకోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ తమిళ నటుడు వివేక్‌ను, శక్తి మసాలా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ పీసీ.దురైసామిని వర్సిటీ గౌరవ డాక్టరేట్లతో సత్కరించింది. సత్యభామ వర్సిటీ చాన్సలర్ కల్నల్ డాక్టర్ జెప్పియార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్ పాల్గొని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.
ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. వివేక్ మాట్లాడూ సొంత ప్రయత్నాలతో ప్రతి ఒక్కరూ రాణించాలని, దీనికి ఎంజీఆర్, జెప్పియార్‌లను ఆదర్శంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీ.షీలారాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌ఎస్‌రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ కేవీ.నారాయణ్, వర్సిటీ డీన్ డాక్టర్ టీ.శశిప్రభ తదితరులు పాల్గొన్నారు.