తమిళనాడులోనూ బంగారం వేట
ఉత్తరప్రదేశ్లో వెయ్యి టన్నుల బంగారు నిధుల కోసం ఇప్పటికే తవ్వకాలు జరుపుతుండగా.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం బంగారం కోసం వేట మొదలు పెట్టింది. యూపీలో మాదిరిగా తవ్వకాలు తతంగం మాత్రం కాదు. 400 కిలో బంగారం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని విలువ 120 కోట్ల రూపాయలు. ఒక్కోటి నాలుగు గ్రాముల బరువుండేలా 22 కేరట్ల స్వచ్ఛమైన లక్ష బంగారు నాణేలు సేకరించనుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు పథకాల కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలకు బంగారు నాణేలు అందజేయనున్నారు.
వీటికోసం తమిళనాడు సాంఘిక సంక్షేమ పౌష్టికాహార భోజన పథకం డైరెక్టరేట్ బుధవారం టెండర్లు పిలిచింది. వచ్చే నెల 22 లోపు బంగారు నగల దుకాణదారులు, డీలర్లు టెండర్లు దాఖలు చేయవచ్చు. టెండరు పొందిన వారు 30 రోజుల్లోపు నాణేలు ప్రభుత్వానికి అందజేయాలి. కాగా ఇంత భారీ స్థాయిలో బంగారు నిల్వలు అందుబాటులో ఉండటం సాధారణ విషయం కాదని, ప్రభుత్వానికి నాణేలు అందజేయడం సవాల్తో కూడిన పనేనని మద్రాస్ బంగారు, వజ్రాల వర్తకుల సంఘం అధ్యక్షుడు జయంతిలాల్ చల్లాని అన్నారు.