అత్తారింటికి వెళ్లేదెవరో!
- నేతల మధ్య మాటల తూటాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు
- సీఎం హెచ్చరిక, విరుచుకుపడ్డ మంత్రులు
- ఎదురుదాడిలో దినకరన్
అత్తారింటికి వెళ్లేది నువ్వంటే.. నువ్వే నంటూ అన్నాడీఎంకే గ్రూపుల మధ్య శనివారం మాటల తూటాలు పేలాయి. మళ్లీ జైలుకు వెళ్తావంటూ సీఎం పళని స్వామి దినకరన్‌కు హెచ్చరిక చేశారు. అమ్మ జయలలిత మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మ శశికళ అని మంత్రులు విరుచుకు పడ్డారు. తానేమీ తక్కువ తిన్నానా..? అంటూ దినకరన్ ఎదురుదాడికి దిగారు. శాశ్వతంగా ఇంటికి.. ఆ తదుపరి అత్తారింటికి వెళ్లబోయేదెవరో మరి కొద్దిరోజుల్లో తేలుతుందని హెచ్చరించారు.
సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో, ప్రభుత్వాన్ని కూల్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని దినకరన్ వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయన్ను గురిపెట్టి పాలకులు తీవ్రంగా స్పందించే ప నిలో పడ్డారు. సీఎం పళని స్వామి మొదలు, మంత్రుల వరకు శనివారం దినకరన్‌ను గురిపెట్టి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. చిన్నమ్మ శశికళ కుటుంబంపై దుమ్మెత్తి పోశారు. అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు శశికళ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అత్తారింటికి దినకరన్ వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. అత్తారిళ్లు(జైలు) తనకు కొత్త కాదని, ఇక, వెళ్లబోయేదెవరో వెయిట్ అండ్ సీ.. అని దినకరన్ ఎదురుదాడికి దిగారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పళని, దినకరన్ శిబిరాల మాటల తూటాలు పేలడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది.
మళ్లీ జైలుకెళ్లడం ఖాయం..
సీఎం పళని స్వామి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, దినకరన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, అందర్నీ తొలగిస్తున్న దినకరన్, అమ్మ జయ లలిత బతికి ఉండి ఉంటే, ఆమె కూడా పదవి నుంచి తొలగించి ఉండే వాడేమోనని మండిపడ్డారు. అమ్మ కన్నెర్ర చేయడంతో పది సంవత్సరాలు వనవాసంలో ఉన్న దినకరన్, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, జబ్బలు చరుస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన బెదిరింపులు, హెచ్చరికలకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత ఆశీస్సులతో తాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యానని పేర్కొంటూ, దినక రన్ లాంటి కపట నాటక దారుడ్ని నమ్మే స్థితిలో అన్నాడీఎంకే కేడర్ లేదని ధీమా వ్యక్తంచేశారు. అమ్మ ఆత్మ ఎన్నడూ క్షమించదని, దినకరన్ అండ్ బృందానికి గుణపాఠం తథ్యమని హెచ్చరించారు.
అమ్మ మరణానికి చిన్నమ్మే కారణం
దిండుగల్, తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన వివిధ కార్యక్రమల్లో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, వెల్ల మండి నటరాజన్, ఓఎస్ మణియన్, బెంజమిన్, ఎంపీలు తంబిదురై, వైద్యలిం గం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. దినకరన్, శశికళను గురిపెట్టి తీవ్రంగానే స్పందించారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగారు. దిండుగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అమ్మ రోగం తీ వ్రత పెరగడంతో, చివరకు సహజ మరణంగా రూపొందించారని ఆరోపించారు. అమ్మను చూసేందుకు ఎవరినీ అనుమతించకుండా శశికళ అడ్డుకున్నారని, అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మేనని ఆరోపించారు. అందుకే ఆ కుటుంబాన్ని సాగనంపడం లక్ష్యంగా తమ ప్రభుత్వం, పార్టీ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.
వెల్లమండి నటరాజన్ స్పందిస్తూ, జయలలిత ఆరోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఉన్నారని, చిన్నమ్మ శశికళ దగ్గరుండి మరీ అమ్మ ఆరోగ్యం క్షీణించేందుకు ప్రధాన కారకురాలు అయ్యారని ఆరోపించారు. ఓఎస్ మణియన్ పేర్కొంటూ, దినకరన్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని, త్వరలో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయం అని హెచ్చరించారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ విషయంగా, ఆమెను వదులుకునే పరిస్థితి ఉండబోదని స్పందించారు. బెంజమిన్ వ్యాఖ్యానిస్తూ, ద్రోహులకు గుణపాఠం నేర్పే రోజు సమీపించిందని హెచ్చరించారు. ఎంపీ వైద్యలింగం మాట్లాడుతూ, దినకరన్ లాంటి వ్యక్తుల కాకమ్మ బెదిరింపులకు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అవసరం అయితే, మెజారిటీ నిరూపించుకుని ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు. తంబిదురై వ్యాఖ్యానిస్తూ, అన్నాడీఎంకే సర్కారును కూల్చడం, ఆ పార్టీని నిర్వీర్యం చేయడం ఎవరితరమూ కాదన్నారు.
దినకరన్ ఎదురుదాడి
తన మీద ఆరోపణలు, విమర్శనాస్త్రాల్ని ఎక్కుబెట్టడంతో దినకరన్ ఎదురు దాడికి దిగారు. అడయార్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలో ఈ మంత్రులు అందరూ శాశ్వతంగా ఇంటికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు. శశికళకు పళనిస్వామి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. అమ్మ ఆశయాలకు తూట్లు పెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పు తిన్న వాడు నీళ్లు తాగక తప్పదని, తిన్నింటి వాసాలు లెక్కించే పళని స్వామి అండ్ బృందం త్వరలో అత్తారింటికి వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. తనకు అత్తారిళ్లు కొత్త కాదని, అయితే, ఇక వెళ్లబోయే వాళ్లకే కొత్త అని వ్యాఖ్యానించారు. తన మీద విదేశీ మారక ద్రవ్యం కేసు మాత్రమే ఉందని పేర్కొంటూ, సీఎం, మంత్రుల వలేæ తాను అవినీతికి పాల్పడ లేదని, ప్రజాధనాన్ని దోచుకోలేదన్నారు. ప్రజా ధనాన్ని కోట్లు కోట్లుగా దోచి దాచి పెట్టుకుంటున్న వాళ్లకు అత్తా రిళ్లు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉందని, ఎవరెవరు వెళ్లబోతున్నారో వేచి చూడంటూ ముగించారు.
బెంగళూరుకు దినకరన్
మాటల తూటాలు ఓ వైపు సాగుతుంటే, మరోవైపు తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీకి దినకరన్ నిర్ణయించారు. మైసూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్ని కలుసుకునేందుకు సిద్ధం అయ్యారు. 20వ తేదీన ఆయన బెంగళూరు మీదుగా మైసూర్‌కు పయనం కానున్నారు. అలాగే, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ చేతిలో ఉన్న మత్స్యకారులకు సంబంధించిన సంఘం పదవిని ఊడగొట్టారు. ఇక, ఈ శిబిరంలో ఉన్న అంబూర్ ఎమ్మెల్యే బాలసుబ్రమణియన్ తాను అజ్ఞాతంలో లేనని, నియోజకవర్గ ప్రజలతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా మీడియా ముందుకు వ్యాఖ్యానించారు.
ఇక, తమ నాయకుడ్ని గురిపెట్టి మంత్రులు, సీఎం స్వరం పెంచడంతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఎదురుదాడికి దిగుతూ, దమ్ముంటే బల పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రెండు శిబిరాల సమరంపై ద్రవిడ కళగంనేత వీరమణి స్పందిస్తూ, ఆత్మలు, కాషాయంలతోనే పాలకుల సంప్రదింపులు అని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ అయితే, పరస్పరం విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్న వాళ్లను శాశ్వతంగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారని వ్యాఖ్యానించారు.