ఆటోలకు మీటర్లు | Tamil Nadu State Government fixed Auto meters fares in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఆటోలకు మీటర్లు

Published Mon, Oct 20 2014 12:07 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఆటోలకు మీటర్లు - Sakshi

ఆటోలకు మీటర్లు

సాక్షి, చెన్నై: ఆటోవాలా దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేయడానికి సిద్ధమైంది. చార్జీల్ని నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ చార్జీల అమలుకు 45 రోజులు గడువు ఇచ్చింది.  ఆటోవాలా దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెన్నై నగరంలోని ఆటోలకు మీటర్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. చార్జీల్ని నిర్ణయించి, గత ఏడాది అమల్లోకి తెచ్చినా.. పూర్తి స్థాయిలో అమలు చేయించేందుకు నానా తంటాలు పడక తప్పడం లేదు. రాజధానిలో 70 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఇందులో 25 నుంచి నలభై శాతం మేరకు ఆటో వాలాలు మీటర్ల వేస్తూ, న్యాయ పరంగా నడుచుకుంటున్నారు. మిగిలిన వాళ్లు యాథా రాజా తదా ప్రజా అన్నట్టుగా తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వారిపై కొరడా ఝుళిపించే పనిలో ట్రాఫిక్ యంత్రాంగం ఉన్నా, పోలీసుల కళ్లుగప్పి తిరిగే ఆటో వాలాలు అధికం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఆటోలకు మీటర్లు తప్పనిసరి చేయాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ పిటిషన్ మద్రాసు హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్ మేరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో చార్జీల్ని నిర్ణయిస్తూ, అమలు లక్ష్యంగా చర్యలు చేపట్టింది.
 
 అమల్లోకి
 అన్ని చోట్లా ఒకే విధంగా చార్జీల్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీచేసింది. చెన్నైలో ఇదివరకు 1.8 కి.మీ దూరానికి కనిష్టంగా రూ.25 నిర్ణయించారు. తదుపరి కిలో మీటరకు రూ.12 చెల్లించుకోవాల్సిందే. రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు మీటరు చార్జీలో సగం అధికం. ఇక వెయింటింగ్ చార్జీగా ప్రతి ఐదు నిమిషాలకు రూ.3.50 పైసలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా చార్జీల్ని నిర్ణయించి ఉండడం గమనార్హం. అన్ని జిల్లాల్లో చార్జీల అమలు బాధ్యతల్ని కలెక్టర్ల భుజాన వేశారు. వారి ఆదేశాల మేరకు ఆర్టీఏ, ఆయా ప్రాంతాల్లోని ట్రాఫిక్ వర్గాలు చార్జీల్ని అమలు చేయించేందుకు ఇక ఆటోవాల వెనుక ఉరకలు తీయాల్సిందే. కాగా, ఈ చార్జీల్ని రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరునల్వేలి, తిరుచ్చి, మదురై, తూత్తుకుడి తదితర నగరాల్లో అమలు చేయడానికి వీలున్నా, ఇతర జిల్లాల్లోని ఆటో డ్రైవర్లు, యాజమాన్యాలు వ్యతిరేకించడం ఖాయం. ఇతర జిల్లాల్లోని నగరాల విస్తీర్ణం అంతంత మాత్రమే. ఈ దృష్ట్యా, తమకు ఈ చార్జీల్ని వ్యతిరేకించేందుకు ఆయా ప్రాంతాల్లోని ఆటో సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇక, చెన్నై వంటి నగరాల్లోని డ్రైవర్లు సైతం వ్యతిరేకించేందుకు రెడీ అవుతున్నారు. అత్యంత రద్దీతో కూడిన నగరాల్లో, చిన్నచిన్న పట్టణ, నగరాల్లోనూ ఆటో చార్జీలు ఒకే విధంగా నిర్ణయించకుండా, ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా చార్జీలు ప్రకటించాలన్న డిమాండ్ తెరమీదకు వస్తోంది. అలాగే, ఆటోల మీటర్లకు మున్ముందు రోజుల్లో భలే డిమాండ్ రాబోతోంది. వీటి ధర కూడా పెరగడం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement