తమిళ పులికి హిందీ క్లాసులు
♦వా.. ఆవో.. పో.. జావో
♦చెన్నై పులితో ఉదయ్‌పూర్ జూ సిబ్బందికి కష్టాలు
♦విధి లేక అక్కడి సిబ్బందినే పిలిపించి శిక్షణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొన్నటి దాకా ఆ పులికి తమిళమే తెలుసు. ఉన్నట్టుండి ఇప్పుడు హిందీ పాఠాలు వల్లె వేస్తోంది. ఎందుకో తెలుసా? ఆ పులిని చెన్నై నుంచి రాజస్తాన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు కాబట్టి. భారత్‌లోని జూపార్కుల వారు వన్యప్రాణులను ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. సంతానోత్పత్తి కోసం సాగే ఈ ప్రక్రియలో భాగంగా చెన్నై వండలూరులోని రామా అనే తెల్ల మగ చిరుతపులిని ఉదయ్‌పూర్ జూపార్కుకు అప్పగించి అక్కడి నుంచి రెండు నక్కలను తెచ్చుకున్నారు.
ఉదయ్‌పూర్ జూపార్కుకు చేరిన తెల్లపులి ఆహార, విహారాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉంటున్నా, అక్కడి సిబ్బంది ఆదేశాలను మాత్రం ఖాతరు చేయడం లేదట. తమిళభాషకు అలవాటుపడిన తెల్లపులి హిందీ భాషను అర్థం చేసుకోలేకపోవడమే దీనికి కారణమట. ఢిల్లీ జూపార్కులో జన్మించిన ఈ తెల్లపులిని పిన్నవయసులోనే చెన్నై వండలూరు జూపార్కుకు తెచ్చారు. దీని పెంపకం బాధ్యతను సెల్లయ్య అనే వ్యక్తికి అప్పగించారు. సెల్లయ్య ద్వారా ‘వా’(ఇటురా), ‘పో’(అటు వెళ్లు) అనే తమిళ మాటలకు పులి అలవాటు పడింది. ప్రస్తుతం ఉదయ్‌పూర్ జిల్లాలో ఉన్న పులిని అక్కడి సిబ్బంది ‘ఆవో...జావో’ అంటే మింగేసేలా గుర్రున చూస్తోందట.
ఇక దీంతో వేగలేమని భావించిన ఉదయ్‌పూర్ జూపార్కు అధికారులు తెల్లపులిని పెంచిన సెల్లయ్యను పంపాల్సిందిగా చెన్నై వండలూరు జూపార్కుకు ఉత్తరం రాశారు. దీంతో సెల్లయ్య ఉదయ్‌పూర్ జూపార్కుకు చేరుకున్నాడు. సదరు పులితో సెల్లయ్య తమిళంలో మాట్లాడుతూనే అక్కడి సిబ్బంది సహకారంతో హిందీ భాషపై శిక్షణ ఇస్తున్నాడు. తమిళ పులి హిందీని కూడా అర్థం చేసుకునే వరకూ సెల్లయ్య నేతృత్వంలో బోధన తరగతులు సాగుతాయి. ఇదండీ పులి చిన్నకథ.