చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్‌పై బదిలీ వేటు
చెన్నై : తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్‌పై మరోసారి బదిలీ వేటు పడింది. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ కమిషనర్ జార్జ్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే పార్టీ అరాచకాలు చేసే అవకాశం ఉందని, వారి ఆటలు సాగకుండా ఉండాలంటే వెంటనే చెన్నై నగర పోలీసు కమిషన్ జార్జ్ ను వేరే ప్రాంతానికి బదిలీ చెయ్యాలని డీఎంకే డిమాండ్ చేసింది.దీంతో ఎన్నికల కమిషన్ ...పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీబీసీఐడీ అడిషనల్ డీజీపీ కరణ్ సిన్హాను నూతన పోలీస్ కమిషనర్‌గా నియమించలింది. వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుంది.
కాగా గతంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా జార్జ్‌ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని రంగంలోకి దించారు. జార్జ్‌ను జైళ్ల శాఖకు పంపించారు. నెల రోజులకు పైగా త్రిపాఠి చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. అనంతరం జార్జ్ తిరిగి చెన్నై కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరోసారి ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈసీ మళ్లీ జార్జ్‌పై బదిలీ వేటు వేసింది.