ప్రచార వేడి
Published Fri, Mar 14 2014 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: మరో 40 రోజుల్లో పోలింగ్ తేదీ ముంచుకొస్తుండగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. జయ ఇప్పటికే దూసుకుపోతుండగా నేటి నుంచి డీఎంకే కోశాధికారి స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రచారం ప్రారంభించనున్నారు. డీఎంకే అధినేత కరుణానిధి సైతం పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అన్నాడీఎంకే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ కారణంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఎటువంటి జాప్యానికి తావులేకుండా ఈనెల 3న కాంచీపురం జిల్లా నుంచి ప్రచార రంగంలోకి దిగారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పన పర్యటిస్తున్నారు. గురువారం ఈరోడ్డు, తిరుపూరు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. 15 వ తేదీన మళ్లీ జయ ప్రచారంలోకి దిగుతారు. కాంగ్రెస్, బీజేపీ, డీఎంకే, డీఎండీకేలు పొత్తుల కోసం ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంలో సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంది.
డీఎండీకే ముందుకు రాకపోవడం, కాంగ్రెస్ స్నేహ హస్తం ఇచ్చినా కరుణ నిరాకరించడం వంటి కారణాల వల్ల డీఎంకే ప్రచారం ఆలస్యమైంది. డీఎంకే తన అభ్యర్థుల జాబితాను మూడురోజుల క్రితం ప్రకటించగా శుక్రవారం నుంచి ఆపార్టీ కోశాధికారి స్టాలిన్ కన్యాకుమారి నుంచి ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన గురువారం రాత్రి కన్యాకుమారి సరిహద్దులో ఉన్న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చేరుకున్నారు. బీజేపీ కూటమి పూర్తిస్థాయిలో సిద్ధమైపోవడంతో అదే కూటమిలో ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌కూడా శుక్రవారం తిరువళ్లూరు నియోజకవర్గంలోని గుమ్మిడిపూండి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. విజయకాంత్ పర్యటన కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనం సిద్ధమైంది. వృద్ధాప్యం కారణంగా డీఎంకే అధినేత కరుణానిధి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటించనున్నారు. ఓపెన్ టాప్ జీపులో కూర్చుని ప్రసంగించేలా తయారవుతున్న ప్రత్యేక వాహనం సిద్ధం కాగానే తేదీలు ఖరారు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా జాబితా కూడా సిద్ధం చేయలేని స్థితి నుంచి బయటపడనందున ప్రచార కార్యక్రమం ఊసే లేకుండా పోయింది.
Advertisement
Advertisement