‘మాకు రూ.22,573 కోట్లు ఇవ్వండి’
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ‘వర్దా’ నష్టం కింద రాష్ట్రానికి రూ.22వేల 573 కోట్లు ఇవ్వాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల వర్దా తుపాను కారణంగా రాష్ట్రానికి కలిగిన నష్టంపై సాయం చేయాల్సిందిగా విన్నవిస్తూ ఈ సందర్భంగా ఓ మెమోరాండం సమర్పించారు. వర్దా తుపాను.. తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి, తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.
ప్రధానితో సమావేశం అనంతరం పన్నీర్ సెల్వం మాట్లాడుతూ... రాష్ట్రానికి రూ.22,573 కోట్లు వరద సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. తక్షణ సాయం కింద వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే దివంగత సీఎం జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని, పార్లమెంట్ ఆవరణలో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పన్నీరు సెల్వంకు ఇదే తొలి ఢిల్లీ పర్యటన.