'అమ్మ'పై పోటీకి తెలుగు నాయకుడి సై
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో సీఎం జయలలిత పోటీచేస్తున్న ఆర్కే నగర్ నుంచి ఆమెపై పోటీచేసేందుకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి సోమవారం స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గతంలో తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్ధతుగా ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. నిర్బంధ తమిళవిద్య ప్రవేశపెట్టడం వల్ల తెలుగువాళ్లు నష్టపోతారని అందుకే ఆ అంశంపై పునరాలోచించాలని ఎన్నిసార్లు వినతిపత్రం కోరినా ఆమె పట్టించుకోలేదని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ కోసం తాను ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికైనా అల్పసంఖ్యాక వర్గాల సమస్యలు తీరుస్తానని జయ హామీ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని తెలిపారు. కేవలం ఆర్కే నగర్ లో లక్షా ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని చెప్పారు. ద్రావిడ పార్టీలు తెలుగు వారి బాగోగుల కంటే వారిని అణగదొక్కే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కృష్ణగిరి జిల్లా హోసూరు నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. మంగళవారం హోసూరులో నామినేషన్ వేస్తానని తెలిపారు.