మోదీ వద్దకు టాటాసన్స్ వివాదం ఎందుకు?
మోదీ వద్ద ‘టాటా’ పంచాయితీ ఎందుకు?
Published Wed, Nov 2 2016 4:54 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రాజకీయాలకు, కేంద్రానికి మధ్యనున్న పారదర్శక పొర మరింత పలుచబడుతున్నట్లుంది. పదివేల కోట్ల డాలర్ల హోల్డింగ్ కంపెనీ ‘టాట్ సన్స్’ సంక్షోభం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లడం ఈ విషయాన్ని సూచిస్తోంది. పదవీచ్యుతుడైన సైరస్ మిస్త్రీ, ఆయన స్థానంలో టాటా సన్స్ చైర్మన్‌గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు వెళ్లి నరేంద్ర మోదీని కలుసుకొని ‘అసలు ఏం జరిగిందంటే...’అంటూ వివరణలు ఇచ్చుకోవడం కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశం అయింది.
అక్టోబర్ 24వ తేదీన టాటా సన్స్ కంపెనీ బోర్డు మీటింగ్‌లో చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన విషయం తెల్సిందే. అనంతరం కంపెనీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్ని తొలగించాల్సి వచ్చిందో ఆ లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టాటా కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీకి స్వయంగా ఫోన్‌చేసి కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ, టాటాకు సుపరిచితుడు. పశ్చిమ బెంగాల్లోని సింగూర్‌లో కంపెనీకి కేటాయించిన స్థలం వివాదం అవడంతో నానో కార్ల కంపెనీని అక్కడి నుంచి గుజరాత్‌కు తరలించేందుకు టాటాకు మోదీ సహకరించిన విషయం తెల్సిందే.
ప్రధానితో టాటాకున్న సాన్నిహిత్యం గురించి బాగా తెల్సిన సైరస్ మిస్త్రీ అక్టోబర్ 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి మోదీని కలుసుకున్నారు. టాటాసన్స్ పరిణామాలపై తన కథనాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెల్సిన మరునాడే కంపెనీ విమానంలో రతన్‌టాటా ఢిల్లీకి వెళ్లి మోదీతో భేటి అయ్యారు. ప్రధాని మోదీ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇద్దరికీ సమయం కేటాయించారు. వారు చెప్పిన అంశాలను ఆసక్తిగా ఆలకించారని తెల్సింది. అయితే వీరేమీ చెప్పారో, వాటిపై ఆయన స్పందన ఏమిటో మాత్రం తెలియరాలేదు.
ఓ కార్పొరేట్ కంపెనీలో చోటు చేసుకున్న అంతర్యుద్ధాన్ని రాజకీయ వేదికపైకి ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావడంలేదని మిగతా కార్పొరేట్ ప్రపంచం విస్తుపోతోంది. ఇదివరకు ఏ కంపెనీ అంతర్గత కలహాల అంశంలో ఇలా జరగిన దాఖలాలు లేవని అంటోంది. ఇతర కంపెనీలకు టాటాసన్స్ గ్రూప్‌కు చాలా తేడా ఉందని, ఇది పబ్లిక్ ఇష్యూ కంపెనీల గ్రూపు కావడమే కాకుండా, దానిలో చోటుచేసుకునే పరిణామాలు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందువల్ల ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంలో తప్పేమి లేదని కొంత మంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
సైరస్ మిస్త్రీని కంపెనీ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో సంక్షోభ పరిస్థితులు సమసిపోలేదు. అసలు సంక్షోభ పరిస్థితులు ఆరంభమైనట్లు భావించవచ్చు. ఎందుకంటే మిస్త్రీ కుటుంబానికి టాటాసన్స్‌లో 18.4 శాతం వాటా ఉంది. అంటే ఆయన కుటుంబ సభ్యుల పేరిట 90వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ఆయన్ని టాటాసన్స్ నుంచి తప్పించినా, అందులో డైరెక్టర్‌గా కొనసాగుతారు, టాటా పవర్, టాటా కెమికల్స్, జాగ్వర్ ల్యాండ్ రోవర్ లాంటి పలు టాటా గ్రూప్ కంపెనీలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వాటి నుంచి కూడా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తే కంపెనీలో సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రం కాకతప్పదు.
అప్పుడు ఎలాగు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు భారీ ఎత్తున టాటా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. ఒక్క యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ రెండు సంస్థలకు కలిపే టాటా స్టీల్స్‌లో 21 శాతం వాటా ఉంది. టాటా సన్స్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టాక్ మార్కెట్‌ను నియంత్రించే సెబీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇందులో షేర్ హోల్డర్ల హక్కుల అంశం కూడా ఇమిడి ఉన్నందున సెబీ కూడా ఏ దశలోనైనా జోక్యం చేసుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వ, సెబీ వైఖరుల ఎలా ఉంటాయో రానున్న పరిణామాలే సూచిస్తాయి.
Advertisement